వరుస గొలుసు దొంగల అరెస్టు

వరుస గొలుసు దొంగల అరెస్టు

హైదరాబాద్ శివారులో గతనెల 26, 27 తేదీల్లో సుమారు 15 గంటల వ్యవధిలో 11 గొలుసు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను నగర పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి చోరీసొత్తుతోపాటు వారు వినియోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకొన్నారు. కేసు వివరాలను బుధవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు. వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కు చెందిన చింతమల్ల ప్రణీత్‌చౌదరి అలియాస్ మాన్య ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే ఆపేసి ఇంగ్లండ్ వెళ్లి బీబీఎం చదివాడు. ఆ సమయంలో అక్కడి నిబంధనల ఉల్లంఘనలు, నేరాలకు పాల్పడిన ఘటనలపై ప్రణీత్‌ను ఇమ్మిగ్రేషన్ విభాగం ఢిల్లీకి పంపించింది. నోయిడా ప్రాంతంలో కొన్నిరోజులు ఉండటంతో కొందరు నేరస్థులతో ప్రణీత్ పరిచయాలు పెంచుకొన్నాడు. 2014-15లో హైదరాబాద్‌కు వచ్చి సరూర్‌నగర్, ఉప్పల్‌లో గొలుసు దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. జైలు నుంచి బయటకొచ్చి తిరిగి ఢిల్లీ వెళ్లి అక్కడ నేరాలుచేసి నోయిడా జైలుకు వెళ్లాడు. నోయిడా జైల్లో కరుడుగట్టిన నేరస్థులైన ఉత్తర్‌ప్రదేశ్, నోయిడా, గౌతమ్ బుద్దనగర్‌కు చెందిన మోనువాల్మీకి అలియాస్ మోను, బులంద్‌షహర్‌కు చెందిన చోకలతో పరిచయం ఏర్పడింది. మోను వృత్తిరీత్యా పందుల పెంచుతూ యూపీ, ఢిల్లీ, హర్యానా రాష్ర్టాల్లో స్నాచింగ్, దోపిడీ ఘటనలకు పాల్పడ్డాడు. ఇతడిపై 40 కేసులు, చోకపై కూడా అలాగే కేసులున్నాయి.

తెలిసిన ప్రాంతం కావడంతో..
స్థానికుడైన ప్రణీత్‌కు ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల కాలనీలపై అవగాహన ఉన్నది. ఆ ప్రాంతంలో స్నాచింగ్‌లకు పాల్పడేందుకు నగరానికి వచ్చి ఓఎల్‌ఎక్స్ నుంచి కేటీఎం బైక్‌ను అద్దెకు తీసుకొని ఆయా కాలనీల్లో రెక్కీ నిర్వహించారు. డిసెంబర్ 26న పారిపోవడానికి వీలుగా ప్రధాన రహదారులకు దగ్గరలోని కాలనీల్లో వరుస స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆ రోజురాత్రి కాచిగూడలోని ఒక లాడ్జిలో బసచేసి మరుసటి రోజు ఉదయం తిరిగి ఎల్బీనగర్ జోన్‌లో 45 నిమిషాల వ్యవధిలోనే ఐదు స్నాచింగ్‌లకు పాల్పడి ఢిల్లీకి పరారయ్యారు. నిందితులను పట్టుకొనేందుకు 120 బృందాలను ఏర్పాటుచేసి వాహనాల తనిఖీలను విస్తృతం చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించి నిందితులు వాడిన బైక్‌ను, బసచేసిన లాడ్జిని పోలీసులు గుర్తించారు.

నగరానికి మళ్లీ వచ్చిన ముఠాసభ్యుల్లో ఇద్దరు బుధవారం ఉదయం హైదరాబాద్ ఈదీబజార్‌లోని అన్మోల్ హోటల్ సమీపంలో పల్సర్ బైక్‌పై వెళ్తూ పోలీసులకు అనుమానాస్పదస్థితిలో పట్టుబడ్డారు. వారిని విచారించగా వరుస స్నాచింగ్‌లకు పాల్పడిన వాల్మీకి, చోకగా తేలింది. వాళ్లిచ్చిన సమాచారంతో కాచిగూడలోని ఒకలాడ్జిలో బసచేసిన ప్రణీత్ చౌదరిని అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో స్నాచింగ్‌లకు ఉపయోగించిన కేటీఎం బైక్‌ను తలాబ్‌కట్టలోని రైల్వేట్రాక్ వద్ద వదిలేసినట్టు వెల్లడించారు. వీరి వద్ద కత్తి కూడా లభించింది. ముగ్గురిని అరెస్ట్‌చేసి స్నాచింగ్ సొమ్ముతోపాటు కేటీఎం పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా దేశంలోని వివిధ రాష్ర్టాల్లో స్నాచింగ్, దోపిడి ఘటనలకు పాల్పడిందని, ఇప్పుడు అరెస్ట్ కాకుంటే మరోసారి హైదరాబాద్‌లో స్నాచింగ్ చేసేవారని, స్నాచింగ్ చేసేందుకు వచ్చి దొరికిపోయారని సీపీ వివరించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్ బృందాన్ని కమిషనర్ అభినందించారు. సమావేశంలో సౌత్‌జోన్ డీసీపీ అంబర్‌కిశోర్, రాచకొండ పోలీసులు పాల్గొన్నారు.