వచ్చి తిని పో !

ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో రాజమహేంద్రవరం , విజయనగరం , విశాఖ , విజయవాడ , తిరుపతి ఒకప్పుడు సంగీత సాహిత్యాలకు పుట్టినిళ్లు . గోదావరీ పావనోదార . . .అంటూ నదీ తీరాల వెంబడి మన వైభవోజ్వల చరిత్రలు ఎలా ఒక వెలుగు వెలిగాయో విశ్వనాథవారు చెప్పారు . ఇప్పుడెలా ఉందో చెప్పగలిగిన స్థాయి ఉన్నవాడినికాను .

విజయవాడ ఆర్ టీ సీ బస్ స్టాండు ప్రధాన ద్వారం దాటి (వారధి వైపు ) బయటికి వస్తుంటే కళ్లు మూసుకున్నా కనిపించేలా నల్లటి బ్యాక్ గ్రౌండులో తెల్లటి బాపు శైలి అక్షరాలతో ఒక హోటల్ పేరు ఇది – వచ్చి తిని పో ! నిజానికి ఫుడ్ కోర్ట్ , ఫుడ్ కార్నర్ , ఫుడ్ సెంటర్ లాంటి యూనివెర్సల్ యాక్సెప్టెడ్ పేర్లు పెట్టకుండా తెలుగులో పేరు పెట్టినందుకు మొదట ఈ హోటల్ వారిని అభినందించాలి . పేర్లకు నామవాచకం కాకుండా ఆదేశాత్మక వాక్యం పెట్టడం తెలిసి చేసినా , తెలియక చేసినా నేరమయితే కాదు .
మాములుగా ఏ హోటల్లో తిన్నారు ? అంటే అరుచి , అశుచి , అజీర్తి , అపక్వలో అనారోగ్య ఆహారం తినివచ్చాము ఇంటిల్లిపాది అని చెప్పుకోవడం సులభం .

కానీ ఈ హోటల్ విషయంలో వచ్చి తిని పోకు వెల్దామా ? వచ్చి తిని పోలో తిని వచ్చాము అని చెప్పడం భాషాపరంగా కొద్దిగా ఇబ్బంది అన్నదే నా బాధ . విజయవాడలో విజయవాడ థర్మల్ ప్లాంటును ఎప్పటినుండో వీ టీ పి అని పొడి అక్షరాల్లో పిలుస్తుంటారు . వచ్చి తిని పో ! ను కూడా అలా ఏమన్నా వీ టీ పి అని పిలుచుకుంటున్నారేమో ?

ఇంగ్లీషు భాష , సంస్కృతి తెలుగును ఎంతగా ప్రభావితం చేస్తుందో ? ఈ పేరు పెట్టినవారు ఖచ్చితంగా – కమ్ అండ్ ఈట్ , ఈట్ అండ్ గో లాంటి పేర్ల వలలో పడి , దాని అనువాదంగా ఇలా దించి ఉంటారు . ఏదయితేనేం ? తెలుగు తెలుగే . వెయ్యండి వీరతాళ్ళు రెండు .

పేరులో కొంత బలవంతం , కర్ర పెత్తనం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ మర్యాదలు మన్ననలు వెళ్ళినవారు , వెళ్లి తిన్నవారే చెప్పాలి .
1 . వచ్చి మర్యాదగా తిను .
2 . మర్యాదగా తిని , మర్యాదగా వెళ్ళు
3 . వచ్చి తినకుండా వెళ్తే మర్యాదగా ఉండదు .
4 . వచ్చి తిని తిన్నగా వచ్చినట్లే వెళ్లకపోతే మర్యాద మిగలదు – లాంటి విపరీతార్థాలు మీకు ధ్వనిస్తే హోటల్ అతను ఎలా బాధ్యుడవుతాడు ?

అతని ఉద్దేశం అక్షరాలా మంచిదే అయి ఉంటుంది . హోటల్ కు ఒక తెలుగు సంపూర్ణ వాక్యాన్ని పేరుగా పెట్టిన అతను అనుమతిస్తే –
వచ్చి అభినందించి పోతా !

-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply