వంశీ పైడిపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చరణ్

చరణ్ కి లైన్ చెప్పిన వంశీ పైడిపల్లి
బాగుందంటూ ఉత్సాహపడిన చరణ్
పూర్తి కథపై జరగనున్న కసరత్తు
దర్శకుడిగా వంశీ పైడిపల్లికి ప్రత్యేకమైన స్థానం వుంది. అన్నివర్గాల వారిని థియేటర్స్ కి రప్పించేలా ఆయన కథలను రెడీ చేసుకుంటూ ఉంటాడు. గతంలో ఆయన చేసిన సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఆయన ‘మహర్షి’ సినిమా చేస్తున్నాడు. షూటింగు దశలో వున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో చరణ్ ను కలిసిన వంశీ పైడిపల్లి ఆయనకి ఒక లైన్ చెప్పాడట. లైన్ బాగుందనీ .. పూర్తి కథను సిద్ధం చేయమని చరణ్ చెప్పినట్టుగా సమాచారం. గతంలో ఈ కాంబినేషన్లో సూపర్ హిట్ మూవీ ‘ఎవడు’ వచ్చిన సంగతి తెలిసిందే. ‘మహర్షి’ తరువాత చరణ్ ప్రాజెక్టుపైనే వంశీ పైడిపల్లి పూర్తి దృష్టి పెట్టనున్నాడు. రాజమౌళి ప్రాజెక్టు మధ్యలో గ్యాప్ దొరికితే వంశీ పైడిపల్లితో కలిసి సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో చరణ్ వున్నాడని అంటున్నారు.