ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ – అమ్మూ నాయర్.

  • ఎ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ – అమ్మూ నాయర్.
  •   తెలుగుసేత – స్వర్ణ కిలారి.
ఒక అద్భుత కథ అంటూ వాడ్రేవు చిన వీరభద్రుడు గారి ముందు మాటతో మొదలైన ఒక అనువాద నిజ జీవిత గాథ. స్వర్ణ కిలారి ఈ పుస్తకాన్ని అనువాదం చేసి క్లింట్ అనే ఓ చిత్రకారుడైన ,కారణజన్ముడైన బాలుడిని తెలుగు వారి వద్ద కూడా అమరుణ్ణి చేశారు.తన రచనకు శాశ్వతత్వం తెచ్చుకున్నారు.ఇది ఒక అమర గాథ. పురాణగాధలలో గంధర్వులు శాపవశాత్తు భూలోకానికి వచ్చి శాపవిమోచనం కాగానే తమలోకానికి వెళ్లిపోతుంటారు క్లింట్ కూడా ఒకవేళ అలాంటి కథలు నిజమే అయితే అలాంటి బాలగంధర్వుడే అనిపించాడు .
మూడవ ఏటనుంచి ఏడవ ఏడు వరకూ అతను గీసిన బొమ్మలు సామాన్య మానవులు అందునా చిన్న బాలుడు గీయడం అసాధ్యం అనిపించింది. అమ్మూ నాయర్ చేసిన తెలివైన పని ఏమిటంటే అతని వ్యక్తిగతమైన, ఆరోగ్యపరమైన విషయాలపై కాకుండా ,క్లింట్ చిత్రకళ,అతనిలోని కళాతృష్ణ వీటిపైన దృష్టి సారించి రచన చేయటం.స్వర్ణ చాలా సహజంగా మూలంలోని సారాన్ని వడిసి పట్టుకుంది.
అందుకని ఇది ఒక బాలుని లేదా ఒకతల్లి యొక్క వేదనాభరితమైన కథలాగా కాకుండా ఒక ఉత్ప్రేరణ,వుత్తేజం కలిగించే విజయగాథలాగా ఉంది.మన అందరిలోనూ క్లింట్ లాంటి ఉత్సుకత,ఉత్సాహం ,పరిశీలన,అధ్యయనం,సాధన కలిగిన బాలుడు  ఉంటాడు మనం గుర్తించాలి.వెలికి తీయాలి.అందుకే ఇది అందరూ తెలుసుకో వలసిన విజయగాథలాగా అనిపించింది.
అతను జీవించిన చిరు జీవన కాలం ఒకపక్కన పెడితే ,అతను నెరవేర్చిన పెద్ద కార్యాలు మాత్రం అనన్య సామాన్యం.చిన్న వయసుకు ఉన్నతంగా ఆలోచించటం,పరిణితితో కూడిన ప్రవర్తన,తల్లితండ్రులపట్ల ఒక నిబద్ధత.అన్నిటినీ మించి  ఏడేళ్ల వయసుకు ఇరవైఐదు వేల పై చిలుకు చిత్రాలను గీయడం.
పుస్తకంలో పొందుపరిచిన చిత్రాలు ముఖ్యముగా ఉత్సవంలో  ఏనుగులు , పడవల రేవు,మాంసం దుకాణం ఒకటేమిటి అన్ని చిత్రాలూ జీవకళతో,ఒక సందేశంతో కూడి ఉండటం ,ఆశ్చర్యకరం. పుస్తకానికి ముఖచిత్రంగా వాడిన వెదురుపొదల మధ్య అస్తమిస్తున్న సూర్యుడు చిన్నారి క్లింట్ ని గుర్తు చేస్తూ కన్నీటి పొర తెప్పించింది.
తల్లిదండ్రులు చిన్నమ్మ,జోసెఫ్ క్లింట్ కు కావాల్సినవి సమకూర్చటానికి పడిన తపన ,చిన్నమ్మ బిడ్డని పెంచినతీరు చాలా సున్నితంగా,సునిశితంగా వ్రాయబడింది.
కులమతాలకు అతీతంగా ఓ బుల్లి కళాకారుడు బ్రతికిన బహుకొద్ది కాలం కళలోనే జీవించి,కళకోసం తపించి, అద్భుత సృష్టి చేసి భారతీయ చిత్రకళా రంగాన తన  ముద్రని వేసి శాశ్వతుడై,అమరుడై అజేయంగా నిలిచాడు.క్లింట్ నీవు వీరాధి వీరుడవు. ప్రతి బాల బాలికలు తప్పక చడవవలసిన, తెలుసుకోవలిసిన గాథ ఇది.
స్వర్ణ కిలారికి ప్రత్యేక అభినందనలు.ఇష్టంతో,మంచి మనసుతో ,శ్రద్ధతో ఓ బిడ్డకు తల్లిగా సున్నితమైన హృదయంతో ఈ పుస్తకాన్ని అనువాదం చేసి తెలుగు పాఠకులకు అందించినందుకు.మరిన్ని మంచి  పుస్తకాలు స్వర్ణ కిలారి నుండి వెలువడాలని  కోరుకుంటూ  శుభాకాంక్షలతో ఈ వ్యాసం ముగిస్తున్నాను.
వసుధారాణి.