లక్ష కోట్లు పోయాయ్‌ ఈ అయిదుగురు 5 నెలల్లో పోగొట్టుకున్న సంపద ఇది..

ఈ ఏడాదిలో ఇప్పటిదాకా భారత అగ్రగామి 20 మంది కుబేరులు ఏకంగా 17.85 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.1.16 లక్షల కోట్లు) సంపదను పోగొట్టుకున్నారు. అందులో తొలి అయిదు మందే 15 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.97,500 కోట్లు) మేర పోగొట్టుకున్నారని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ సూచీ చెబుతోంది.
గౌతమ్‌ అదానీ
గౌతమ్‌ అదానీ అత్యధికంగా 3.68 బిలియన్‌ డాలర్లను పోగొట్టుకోవడంతో ఆయన నికర సంపద 6.75 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు అత్యంత ప్రయోజనం పొందే వ్యక్తిగా ఈయనపై అందరూ అంచనా వేశారు. అయితే ఈ ఏడాది అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు 7-45 శాతం వరకు నష్టాల పాలయ్యాయి. 2017-18లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పవర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ల నికర లాభం 13.76 శాతం వృద్ధి చెంది రూ.3546 కోట్లకు చేరింది. బ్లూమ్‌బర్గ్‌ సూచీలో అదానీ 242 స్థానంలో ఉన్నారు.

అజీమ్‌ ప్రేమ్‌జీ
విప్రోలో మెజారిటీ వాటా ఉన్న అజీమ్‌ ప్రేమ్‌జీ కూడా ఈ ఏడాదిలో భారీగానే(దాదాపు 3.5 బి. డాలర్లు) నష్టపోయారు. సంప్రదాయ వ్యాపారంలో క్షీణత కొనసాగడం, వ్యాపారంలో సవాళ్లు, వృద్ధి స్థిరంగా కొనసాగకపోవడంతో కంపెనీ ఇబ్బందులు పడుతోందని బ్రోకరేజీ సంస్థ షేర్‌ఖాన్‌ అంటోంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఈ కంపెనీ షేరు 16 శాతం నష్టపోయింది.

దిలీప్‌ సంఘ్వి
ఇక మరో బిలియనీర్‌, సన్‌ఫార్మాసూటికల్స్‌ అధిపతి దిలీప్‌ సంఘ్వి కూడా ఈ ఏడాది 3.48 బిలియన్‌ డాలర్లు పోగొట్టుకుని 9.34 బిలియన్‌ డాలర్లకు నికర సంపద పరిమితం చేసుకున్నారు. ఈ కంపెనీ షేరు ఈ ఏడాదిలో 21 శాతం నష్టపోయింది. అమెరికా జనరిక్‌ వ్యాపారం రాణించకపోవడంతో పాటు ఇతర పోటీ సంస్థల నుంచి కాంప్లెక్స్‌ ఇంజెక్టబుల్స్‌ల విభాగంలో ఒత్తిడి ఎదురుకావడంతో షేరు ధరపై ప్రభావం కనిపించింది. ప్రపంచ కుబేరుల్లో సంఘ్వి 153వ స్థానంలో ఉన్నారు.

ముకేశ్‌ అంబానీ
ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ నికర సంపద ఈ ఏడాది కొద్దిగానే తగ్గింది. 2.83 బిలియన్‌ డాలర్లు పోగొట్టుకుని 37.4 బిలియన్‌ డాలర్ల సంపదతో నిలిచారు. ఈ ఏడాది ఇప్పటిదాకా కేవలం 1 శాతం మాత్రమే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టపోవడం ఇందుకు నేపథ్యం. రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మాత్రం 25 శాతం తగ్గింది.

కుమార మంగళం బిర్లా
కుమార మంగళం బిర్లాకు చెందిన ఎనిమిది నమోదిత కంపెనీలు కలిసి 19.72 శాతం మేర నష్టపోవడంతో 2017 చివర్లో ఉన్న రూ.2,73,932 కోట్ల మార్కెట్‌ విలువ కాస్తా ఇపుడు రూ.2,19,904 కోట్లకు చేరుకుంది. హిందాల్కో, ఐడియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏబీ క్యాపిటల్‌లు ఈ ఏడాది 7-50 శాతం మేర నష్టాల పాలయ్యాయి. దీంతో ఆయన నికర సంపద 2.24 బిలియన్‌ డాలర్లు పోగొట్టుకుని 6.83 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. డీఎల్‌ఎఫ్‌ అధిపతి కేపీ సింగ్‌ సైతం కొంత నష్టపోయారు. ఈ ఏడాది డీఎల్‌ఎఫ్‌ షేర్లు 25 శాతం క్షీణించడంతో సింగ్‌ నికర సంపద 1.65 బి. డాలర్లు తగ్గి 4.79 బి. డాలర్లకు చేరింది.