రైతుల రుణమాఫీకి సీఎం కుమారస్వామి హామీ

ఐదేళ్లూ పాలిస్తామని ధీమా
కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌)లది అపవిత్ర బంధం
సభలో యడ్యూరప్ప ధ్వజం
ఎట్టకేలకు కర్ణాటక రాజకీయ చదరంగానికి ఒక ముగింపు వచ్చింది. అనేక ఉత్కంఠభరిత పరిణామాల అనంతరం… శుక్రవారం శాసనసభలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి కుమారస్వామి విజయం సాధించారు. బలపరీక్షకు ముందే విపక్ష భాజపా సభ నుంచి వాకౌట్‌ చేయడంతో… కుమారస్వామి విజయం నల్లేరుపై నడక అయింది. కాంగ్రెస్‌, జనతాదళ్‌ (ఎస్‌) సంకీర్ణ పాలన ప్రారంభానికి మార్గం సుగమమైంది.
సభ ప్రారంభం కాగానే నూతన సభాపతిగా కె.ఆర్‌.రమేశ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి…‘‘ఈ సభ హెచ్‌.డి.కుమారస్వామి నాయకత్వంలోని మంత్రివర్గం పట్ల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తోంది’’ అంటూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ఓటింగ్‌కు రావటానికి ముందు కుమారస్వామి, విపక్ష నేత యడ్యూరప్ప మధ్య దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు. యడ్యూరప్ప చేసిన పలు ఆరోపణలు, విమర్శలకు కుమారస్వామి స్పందించేలోగా విపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. అనంతరం విశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో తీర్మానం నెగ్గినట్లు సభాపతి ప్రకటించారు. విశ్వాస పరీక్ష నెగ్గేందుకు 112 ఓట్లు అవసరం కాగా తీర్మాన ప్రవేశ సమయానికి సభలో 116 మంది పాలకపక్ష సభ్యులున్నారు.

రైతు రుణాల్ని మాఫీ చేస్తాం: కుమారస్వామి
మూజువాణి ఓటింగ్‌కు ముందు, తర్వాత ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభలో ప్రసంగించారు. సహకార సంఘాలు, జాతీయ, ప్రైవేటు బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రూ.53 వేల కోట్ల రుణాల్ని మాఫీ చేస్తామని ప్రకటించారు. రుణాల మాఫీ వల్ల ఏర్పడే ఆర్థిక భారాన్ని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రజలపై మోపబోమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎవరూ ఆందోళనలకు దిగే అవసరం రాకుండా సుపరిపాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. విపక్షం జోస్యం చెప్పినట్లు తమ ప్రభుత్వం రెండు, మూడు మాసాలకు కూలిపోదని, ఐదేళ్లూ పాలిస్తామని పేర్కొన్నారు.

అత్యధిక స్థానాల్ని పొందిన భాజపాకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వకుండా… అపవిత్ర మైత్రితో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని విపక్ష నేత యడ్యూరప్ప చేసిన ఆరోపణల్ని కుమారస్వామి ఖండించారు. పొరుగు రాష్ట్రం గోవాలో ఎందుకు ఈ విధానాన్ని పాటించలేదని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు జోక్యం వల్లే కర్ణాటకలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టిందని న్యాయవ్యవస్థను కొనియాడారు.
‘కర్ణాటకలో భాజపా ప్రభుత్వమే ఏర్పాటవుతుంది. ఇతర పార్టీల ప్రభుత్వాలు ఏర్పాటయ్యేందుకు అవకాశాన్ని ఇవ్వబోమ’ని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రకటించారని కుమారస్వామి గుర్తుచేశారు. ‘ఇదేనా ప్రజాస్వామ్య పరిరక్షణ? ప్రధాని హోదాలోని వ్యక్తి చేయాల్సిన ప్రకటనలేనా ఇవి’ అని ప్రశ్నించారు. తమను నిర్దాక్షిణ్యంగా అణిచివేసేందుకు ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను ఉసి గొల్పిందని ఆరోపించారు. తనకు మలేషియాలో ఆస్తులున్నాయంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు వెంట పడ్డారని ఆరోపించారు. అధికారం కోసం తానేమీ వెంపర్లాడలేదని కుమారస్వామి స్పష్టీకరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న దశలోనే దిల్లీ కాంగ్రెస్‌ నేతలు డాక్టర్‌ పరమేశ్వర్‌, గులాంనబీ ఆజాద్‌ తదితరులు సంకీర్ణ సర్కారు స్థాపనకు చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాన్నారు. తనకుగానీ, తండ్రి దేవేగౌడకు గానీ అధికార దాహం లేనే లేదన్నారు. ‘‘నాడు కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరణతో దేవేగౌడ ప్రధాని పదవి నుంచి దిగటానికి ముందు వాజపేయి మద్దతిస్తామన్నారు. దాన్ని దేవేగౌడ తిరస్కరించారు’ అని గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ పశ్చాత్తాప్పడుతుంది: యడ్యూరప్ప
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల ప్రకారం రైతులకున్న రూ.53 వేల కోట్ల రుణాల్ని సాయంత్రం లోగా మాఫీ చేయక పోతే సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహించనున్నట్లు విపక్ష నేత యడ్యూరప్ప హెచ్చరించారు. విశ్వాస పరీక్షకు ముందు ముప్పావుగంట పాటు చేసిన ప్రసంగంలో… నమ్మిన వాళ్లను నట్టేట ముంచటంలో సిద్ధహస్తులైన దేవేగౌడ, కుమారస్వామిలతో కలసినందుకు త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ పశ్చాత్తాపడుతుందని యడ్యూరప్ప జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీయే ప్రభుత్వాన్ని స్థాపించటానికి బదులుగా జేడీఎస్‌తో ఎందుకు చేతులు కలిపిందో అర్థం కావటం లేదని అన్నారు. తమతో కలసి ప్రభుత్వాన్ని స్థాపించటం దేవేగౌడకు ఏమాత్రం ఇష్టం లేదనటంలో నిజం లేదన్నారు. ఆయన తమ ప్రభుత్వానికి రాసిన లేఖలు వందల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఇకపై తమ పోరు ఈ తండ్రి కొడుకులపైనే కానీ కాంగ్రెస్‌తో ఎంత మాత్రం కాదని ప్రకటించారు.

రెండోసారి సభాపతిగా రమేశ్‌కుమార్‌
విధానసభ సభాపతిగా శ్రీనివాసపురం ఎమ్మెల్యే, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కె.ఆర్‌.రమేశ్‌కుమార్‌ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. చివరి క్షణంలో భాజపా అభ్యర్థి సురేశ్‌కుమార్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో రమేశ్‌కుమార్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. 1994-99 మధ్య కూడా రమేశ్‌కుమార్‌ సభాపతిగా పని చేశారు.