ys jagan mohan reddy

రైతులు పంట వేసే ముందే ఎంతకు కొంటామనేది చెబుతాం: వైఎస్ జగన్

రైతులు పంట వేసే ముందు ఎంతకు కొంటామనేది చెబుతామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, రైతన్న బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, అందుకే, తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘వ్యవసాయం’ ను పండగ చేస్తామని, రైతన్న ముఖంలో చిరునవ్వు చూద్దామని అన్నారు. ఈ సందర్భంగా  రైతులకు పలు హామీలు ఇచ్చారు.

ప్రతి రైతు కుటంబానికి అండగా ఉంటామని, నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు గన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని, చెరువులను పునరుద్ధిస్తామని, జలకళ మళ్లీ తెస్తామని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోయారని, రేపల్లెలో 18 వేల ఎకరాల్లో ఆక్వా సాగు ఉందని, పంట చేతికొచ్చే సమయానికి దళారులు ఏకమై రైతులను దోచేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో రైతులకు కష్టం, నష్టమే మిగిలిందని, చంద్రబాబు పాలనలో రైతులకు మిగిల్చింది దు:ఖమేనని, వ్యవసాయ రుణమాఫీ అంటూ మోసం చేశారని దుయ్యబట్టారు.