రేవంత్ రెడ్డి ఆస్తులు కేసుల వివరాల వెల్లడి!

రేవంత్.. సీఎంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడా?

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల బరిలో ఉన్న మహాకూటమిలో జనాకర్షణ బాగా ఉన్న నేతల జాబితా తీస్తే రేవంత్ రెడ్డి పేరు ముందుంటుంది. ఆయన్ని కాంగ్రెస్‌తో పాటు మిగతా పార్టీలు కూడా స్టార్ క్యాంపైనర్‌గా చూస్తున్నాయి. రేవంత్ స్థాయిలో ఆకర్షణ ఎవరికీ లేదని.. ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించాలని డిమాండ్లు చేస్తున్నారు అభిమానులు. ఐతే రేవంత్ లాంటి వాళ్లు ప్రసంగాలు బాగా చేయగలరని.. పాలనా పరంగా పనికి రారని అనేవాళ్లూ లేకపోలేదు. ఈ విమర్శలపై రేవంత్ స్పందించాడు. హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. తాను పాలనకు పనికి రాననే విమర్శల్ని తనకు తానుగా ప్రస్తావించి సమాధానం చెప్పాడు.

తాను కేవలం రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రసంగాలకు మాత్రమే పనికొస్తానని.. పాలనాపరంగా పనికిరానని కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కానీ తనకు అవకాశమిస్తే ఏం చేయగలనో చూపిస్తానని రేవంత్ అన్నాడు. పరిపాలన విభాగంలో ప్రజలను భాగస్వాములను చేయాలనే ఆలోచనతో తాను ఉన్నట్లు చెప్పాడు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ప్రజారంజక పాలన అందించారని.. ఆయనకు అప్పటివరకు పరిపాలనలో అనుభవం లేదని.. అలాగే ఇందిరా గాంధీ హఠాన్మరణంతో ప్రధాని బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ కూడా దేశ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు.. సంస్కరణలు తీసుకొచ్చారని రేవంత్ అన్నాడు.

అనుభవం కంటే సంకల్పం ముఖ్యమని.. తాను పరిపాలనలో సత్తా చాటగలనని రేవంత్ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా రేవంత్ తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడని భావిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ మీద.. కేసీఆర్ మీద రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.  బంగారు తెలంగాణ తీసుకొస్తామన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నాడు. కేవలం ప్రజల భావోద్వేగాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డాడు. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, స్వయం పాలనే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని.. కానీ కుటుంబ పాలన తీసుకొచ్చి నక్సలైట్ అజెండాను కేసీఆర్ తుంగలో తొక్కారని అన్నాడు.

కేసీఆర్ మనవడు ఏ సన్న బియ్యంతో అయితే అన్నం తింటాడో.. అదే సన్న బియ్యంతో పిల్లలు అన్నం తినేలా చేస్తామని కేటీఆర్ చెబుతున్నాడని.. కానీ కేసీఆర్ మనవడు దీనికేమైనా కొలబద్దా అని రేవంత్ ప్రశ్నించాడు. కేటీఆర్‌ తనయుడిని రోల్ మోడల్‌గా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించాడు. తనకున్న ఒక్కగానొక్క కూతురి నిశ్చితార్థానికి తాను హాజరుకాకుండా కేసీఆర్ పెద్ద ప్రయత్నమే చేశారని.. ఢిల్లీ నుంచి లాయర్లు పిలిపించుకుని బెయిల్ దక్కకుండా చూడాలని ఒత్తిడి తెచ్చారని.. అదేం రాక్షసానందమో తనకు అర్థం కాలేదని రేవంత్ అన్నాడు.