రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబుకు ఉలుకెందుకు?: మంత్రి అనిల్ కుమార్

  • పోలవరం పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించిన ఏపీ సర్కారు
  • పోలవరం ఆపేస్తారని చంద్రబాబు అనడం హాస్యాస్పదమన్న మంత్రి
  • రివర్స్ టెండరింగ్ తో ఇవాళ రూ.50 కోట్లు ఆదా అయిందని వెల్లడి

ఏపీ ప్రభుత్వం ఇవాళ పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రివర్స్ టెండరింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబుకు ఉలుకెందుకని ప్రశ్నించారు. పోలవరం ఆపేస్తారని చంద్రబాబు ఆరోపించడం హాస్యాస్పదం అని అన్నారు.

నవంబరు నుంచి పనులు ప్రారంభిస్తామని పదేపదే చెబుతున్నామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని చెప్పారు. ఇవాళ నిర్వహించిన రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి రూ.50 కోట్లు ఆదా అయిందని వివరించారు. పోలవరం నిర్వాసితులకు వచ్చే ఏడాది లోపు 25,000 ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.