రాహుల్ గాంధీని బఫూన్ అనడంలో తప్పేమీలేదు!

రాహుల్ గాంధీని బఫూన్ అనడంలో తప్పేమీలేదు!

టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బఫూన్ అనడంలో తప్పేమీలేదని ఎంపీ కవిత తెలిపారు. ప్రతిపక్ష నేత పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించి దేశ ప్రధానిని ఎలా హత్తుకున్నరో దేశ ప్రజలంతా చూశారు. సిల్లీగా ప్రవర్తించే వారిని బఫూన్ అనే అంటారని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపీల మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. మా ఎజెండా ప్రజల కోసం పనిచేయడమే.. రాజకీయ పార్టీల కోసం కాదు. దేశంలో అనేక రాజకీయ కూటములున్నాయి.. కొన్ని విజయం సాధించాయ‌ని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచడంలో ఘోరంగా విఫలమైంది. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తటస్థ కూటమి ఏర్పాటు కావాల్సిన సమయం వచ్చింది. రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే రాజకీయ కూటమిలో టీఆర్‌ఎస్ లేదు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్న స్థానిక పార్టీల జాబితాలో మేమున్నాం. ఒక అభ్యర్థి ప్రధాని కావడం, ఒక పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం కాదు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రజా సమస్యలను పరిష్కరించాం. జాతీయస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఫెడరల్ ఫ్రంట్ ఉండబోతోంది. నాలుగు రాష్ర్టాలలో కాంగ్రెస్ భారీ విజయాలేమీ సాధించలేదు. పెద్ద కాంగ్రెస్ కాదు, చిన్న కాంగ్రెస్ గానే కాంగ్రెస్ పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో స్థానిక పార్టీలు పెద్దపాత్ర పోషించాయి. జాతీయ రాజకీయాల్లో ప్రజలకు దగ్గరగా ఉండే స్థానిక పార్టీలు పెద్దపాత్ర పోషిస్తాయి. కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలతో కలిసి పనిచేస్తాం. ఎన్డీఏ కూటమికి టీఆర్‌ఎస్ టీమ్-బి గా లేదు. భారత ప్రజల టీమ్‌గా టీఆర్‌ఎస్, ఫెడరల్ ఫ్రంట్ ఉండబోతోందని వివరించారు.