రాసిపెట్టుకోండి… కేసీఆర్ ను 100 స్థానాల్లో ఓడిస్తాం: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్ మాటలను ప్రజలు పట్టించుకోరు
  • బీజేపీ, ఎంఐఎం తప్ప ఏ పార్టీతోనైనా కలుస్తాం
  • టీడీపీతో పొత్తుకు కూడా సిద్ధమే

కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలెవరూ పట్టించుకోరని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఎంత బలమైన వాదనను వినిపించినా ప్రజలు మద్దతివ్వరని చెప్పారు. ఐదేళ్లపాటు పాలించమని ప్రజలు అధికారమిస్తే… భయంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వల్ల, కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణకు ప్రమాదం ఉందని భావించే అందరితో కలసి కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని చెప్పారు.

బీజేపీ, ఎంఐఎం తప్ప ఏ పార్టీతోనైనా కలుస్తామని అన్నారు. కాంగ్రెస్ తో కలిసేందుకు టీడీపీ మొగ్గుచూపినా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెబుతారని, టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోతుందని అన్నారు. ‘రాసి పెట్టుకోండి… 100 స్థానాల్లో కేసీఆర్ ను ఓడిస్తాం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు స్పందించారు.