రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలి :సీపీఎం నేత బీవీ రాఘవులు

రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలి
మూడు చోట్ల మూడు రాజధానులు అర్థంలేని విషయం
కోపతాపాలతో రాష్ట్రాన్ని పణంగా పెట్టొద్దు
ప్రపంచంలోనే విచిత్రంగా మాట్లాడుకునే విషయం ‘మూడు రాజధానులు’ అని సీపీఎం సీనియర్ నేత బీవీ రాఘవులు అన్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఆయన కర్నూలు వెళ్లారు. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో రాఘవులు మాట్లాడారు.

‘మూడు రాజధానుల’ అంశం గురించి జరుగుతున్న పరిణామాలపై మాట్లాడాల్సిందిగా కోరగా ఆయన స్పందిస్తూ, ‘మూడు రాజధానులు’ అన్నదే బాగుండలేదని, ఎప్పుడైనా రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మూడు చోట్ల మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకోవడమన్నది అర్థంలేని విషయమని విమర్శించారు. పరిపాలన, న్యాయం, శాసనం ఈ మూడు కలిసి ఉంటే రాజ్యం బాగుంటుంది కానీ, మూడు ముక్కలు చేస్తే రాజ్యం ఎలా బాగుంటుంది? ‘వికేంద్రీకరణ’ అంటే కింద నుంచి పరిపాలన జరగాలని, పైస్థాయిలో ముక్కలు చేస్తే ఏముంటుందని రాఘవులు ప్రశ్నించారు.

పంచాయతీలను బలపర్చి, వాటికి నిధులు, హక్కులు, బాధ్యతలు ఇచ్చిన తర్వాత పై స్థాయి గురించి మాట్లాడాలని ప్రభుత్వానికి సూచించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి వుంటే కనుక దీనికి పాల్పడ్డ వారిని పట్టుకుని కేసులు పెట్టి శిక్షలు వేయించాలని, దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పరని అన్నారు. ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా రాష్ట్రాన్ని, ప్రజలను ఇబ్బంది పెడతామనడం, కోపతాపాలతో రాష్ట్రాన్ని పణంగా పెట్టడం న్యాయం కాదని అన్నారు. ఏపీని చక్కగా పరిపాలించి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారని భావించి జగన్ కు ప్రజలు అధికారం ఇచ్చారని, దానిపై ఆయన దృష్టి కేంద్రీకరించడం మంచిదని సూచించారు.