రామోజీ ఫిలింసిటీలో ‘సాహో’

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మార్కెట్‌ సెట్‌లో జరుగుతున్న చిత్రీకరణలో కథానాయిక శ్రద్ధాకపూర్‌తోపాటు, మరికొద్దిమంది నటులు పాల్గొంటున్నారు. నలభై రోజులకిపైగా ఈ షెడ్యూల్‌ సాగుతుందని సమాచారం. సన్నివేశాలతో పాటు, కొన్ని భారీ పోరాట ఘట్టాల్ని కూడా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఇప్పటికే ప్రభాస్‌ గల్ఫ్‌ దేశాలు చుట్టొచ్చారు. అక్కడ రూ.90 కోట్ల వ్యయంతో యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా ప్రచారంలో ఉన్న ‘సాహో’లో, తక్కువ విజువల్‌ ఎఫెక్ట్స్‌ వాడుతూ యాక్షన్‌ ఘట్టాలన్ని చాలా వరకు సహజంగా తెరకెక్కిస్తున్నట్టు చిత్రబృందం చెబుతోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, ఎవ్లీన్‌ శర్మ, లాల్‌, అరుణ్‌ విజయ్‌, మందిరాబేడి, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిషోర్‌, మహేష్‌ మంజ్రేకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్‌.మది, సంగీతం: శంకర్‌ – ఎహసాన్‌ – లాయ్‌.