రాముడే దిక్కు

నేను సినిమాలకు విముఖుడిని కాను కానీ , సినిమాలే నన్ను విముఖుడిని చేశాయి . పెరిగే వయసు రెండో కారణమేమో .
పుర్రెకో బుద్ధి – జిహ్వకో రుచి అని సామెత . ఎవరి అభిరుచులు వారివి .

ఈ మధ్య సినిమా టైటిల్స్ రాముడి మీద పడ్డాయి . మంచిదే .
కత్తికొక వేటుగా సొరకాయ తరిగినట్లు గొంతులు కోసే హీరో – రాముడిలా ధర్మసంస్థాపన కోసమే విలన్లను చంపుతూ చివర విజయాన్ని వరించాడని దర్శకుడు గంభీరంగా మనకు చెబుతున్న సందేశమని మనం అనుకుంటే సభ్యత .
అరవింద సమేత వీర రాఘవుడు రాయలసీమలో ధర్మాన్ని యునానిమస్ గా స్థాపించి , ఇప్పుడు వినయ విధేయ రాముడిగా బోయపాటివారి ఆశ్రమంలో విడిది చేశారు , త్వరలో వారి ఆశ్రమం నుండి విడుదలై తెరలమీద రామబాణం సంధిస్తారు .

ఆ రాముడికి ఈ రాముళ్ళకు పోలిక పెట్టవచ్చా ? పెట్టకూడదా అని చర్చించడానికి ఈ నవ యుగధర్మం ఒప్పుకోదు .

వాల్మీకి నారదుడిని అడిగిన రాముడి 16 గుణాలు తప్పకుండా సినిమా టైటిల్స్ గా రావాలని కోరుకుందాం . అలా అయినా ఆ గుణాలు జనం నోళ్ళల్లో నానుతుంటాయి – అన్నమయ్య దేవ దేవంభజే కీర్తన సినిమాలో వాడిన తరువాతే అన్నమయ్యను వెతికి బాగుంది అని మనం అభినందిస్తున్నట్లు .

సినిమా రామ రామేతి సహస్రనామ తత్తుల్యం ప్రేక్షక రామ వరాననే .

శుభోదయం
-పమిడికాల్వ