రామాయణం పలుకుబళ్లు

మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ , ప్రతిబింబిస్తూ ఉంటుంది . తెలుగులో కూడా అంతే .ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది . చెప్పడానికి వీలుకాకపోతే – అబ్బో అదొక రామాయణం . జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే – సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ . ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే – అదొక పుష్పకవిమానం . కబళించే చేతులు , చేష్ఠలు కబంధ హస్తాలు . వికారంగా ఉంటే – శూర్పణఖ . చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ). పెద్ద పెద్ద అడుగులు వేస్తే – అంగదుడి అంగలు . మెలకువలేని నిద్ర – కుంభకర్ణ నిద్ర . పెద్ద ఇల్లు – లంకంత ఇల్లు . ఎంగిలిచేసి పెడితే – శబరి . ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే – ఋష్యశృంగుడు .అల్లరి మూకలకు నిలయం – కిష్కింధ కాండ .

విషమ పరీక్షలన్నీ మనకు రోజూ – అగ్ని పరీక్షలే . పితూరీలు చెప్పేవారందరూ – మంథరలే . యుద్ధమంటే – రామరావణ యుద్ధమే . ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ – రావణ కాష్ఠాలే .)కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం ). సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు .బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు . ఒంటిమిట్టది ఒక కథ . భద్రాద్రిది ఒక కథ . అసలు రామాయణమే మన కథ . అది రాస్తే రామాయణం – చెబితే మహా భారతం .

శుభోదయం
-పమిడికాల్వ మధుసూదన్