రాజ్యాంగ సంక్షోభం: సుప్రీం న్యాయమూర్తులపై సీబీఐ విచారణకు ఆదేశించి షాకిచ్చిన హైకోర్టు జడ్జి!

కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు తనపై జారీ చేసిన వారంటుపై స్వీయ స్టే విధించిన పశ్చిమ బెంగాల్ హైకోర్టు జడ్జి సీఎస్ కర్ణన్, సుప్రీం న్యాయమూర్తులపై సీబీఐ విచారణకు ఆదేశించారు. తాను కోర్టు ముందు హాజరు కాబోనని స్పష్టం చేసిన ఆయన, సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తులపైనా విచారించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేశారు. భారత న్యాయ వ్యవస్థలో తనను ఏకాకిని చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని, ఎవరి ప్రమేయంతో తనపై వారంట్ జారీ చేశారో తేల్చాలని ఈ సందర్భంగా సీబీఐని ఆయన ఆదేశించారు.

తనకు జరిగినట్టుగా గతంలో ఎన్నడూ జరగలేదని, దళితుడిని, తక్కువ కులం నుంచి వచ్చిన వాడిని కాబట్టే తనకు అన్యాయం చేస్తున్నారని చెబుతూ, వెంటనే సీబీఐ కేసును రిజిస్టర్ చేసి, విచారణ జరపాలని, ఆ నివేదికను ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు ఇవ్వాలని ఆదేశించారు. తనపై వారంటును కోరిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గిపైనా విచారించాలని ఆర్డర్ వేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226, ఐపీసీ సెక్షన్ 482 కింద విచారించాలని, ఐపీసీలోని ఎస్సీ ఎస్టీ చట్టాలను అతిక్రమించారా? అన్నది తేల్చాలని ఆయన ఆదేశించారు. కాగా, ఇప్పటికే కర్ణన్ కు ఉన్న జ్యుడీషియల్ పవర్ ను తొలగిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయన ఆదేశాలను సీబీఐ పాటిస్తుందా? అన్న సంగతి తేలాల్సి వుంది.