రణరంగాన్ని తలపించిన శ్రీలంక పార్లమెంటు.. కారం చల్లి.. కొట్టుకుంటూ…

శ్రీలంక పార్లమెంటు శుక్రవారం యుద్ధరంగంగా మారిపోయింది. ఎంపీలు ఇష్టం వచ్చినట్టు తన్నుకున్నారు. ఒకరిపై ఒకరు కారప్పొడి చల్లుకుంటూ, ఈడ్చుకుంటూ, ముష్టిఘాతాలు కురిపించుకుంటూ చితక్కొట్టుకున్నారు. శుక్రవారం రెండో రోజు సమావేశమైన పార్లమెంటులో జరిగిన ఈ ఘటనలు శ్రీలంక ప్రభుత్వానికి మాయనిమచ్చగా మిగిలాయి. ఇటీవల జరిగిన బలపరీక్షలో మహీంద రాజపక్సే ఓటమి పాలయ్యారు. దీంతో శుక్రవారం రెండోసారి మరోమారు బలపరీక్ష నిర్వహించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తూ స్పీకర్‌ జయసూర్యకు నోటీసులు ఇచ్చారు.

అందుకు ఆయన అంగీకరించకపోవడంతో రాజపక్సే మద్దతుదారులు రెచ్చిపోయారు. ప్రతిపక్ష ఎంపీలపై కారప్పొడి చల్లి నానా రభస చేశారు. స్పీకర్‌పై పుస్తకాలు, నీళ్ల బాటిళ్లు విసిరారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులనూ విడిచిపెట్టలేదు. స్పీకర్ కుర్చీని పోడియం నుంచి ఈడ్చుకెళ్లారు. దాడిలో ఇద్దరు గాయపడ్డారు. ఇంత జరుగుతున్నా రాజపక్సే మాత్రం తన సీటులోంచి కదలలేదు. తన మద్దతుదారులను ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.