మూడోసారి అసెంబ్లీ రద్దు

తెలుగు రాష్ర్టాల్లో శాసనసభలు షెడ్యూల్ ప్రకారం పూర్తికాలం పనిచేయకుండా మూడుసార్లు రద్దయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు (ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు) వివిధ కారణాలతో 7వ, 11వ శాసనసభలను రద్దుచేయాల్సిందిగా కోరడంతో నాటి గవర్నర్లు వాటిని ముందుగానే రద్దుచేశారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తొలి శాసనసభను రద్దుచేశారు. టీడీపీ స్థాపించిన తర్వాత 1983 జనవరి 9న తొలిసారి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీ రామారావు.. 1984 ఆగస్టు 16 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతరం నాదెండ్ల భాస్కర్‌రావు వల్ల తలెత్తిన రాజకీయ సంక్షోభం వల్ల ఎన్టీఆర్ సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గి మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్.. 1984 నవంబర్ 22న ఆ శాసనసభను ముందుగానే రద్దుచేసి 1985 మార్చి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
ఉమ్మడి ఏపీలో ఎన్టీ రామారావు తర్వాత ఆయన అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శాసనసభను రద్దుచేశారు. అలిపిరి ఘటన ఇందుకు కారణమయ్యింది. 1999లో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 2004 వరకు ఆ పదవిలో కొనసాగాల్సి ఉన్నది. అయితే 2003 అక్టోబర్ 1న తిరుమలేశుని దర్శించుకునేందుకు వెళ్తున్న చంద్రబాబుపై అలిపిరి వద్ద మందుపాతర దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన చంద్రబాబు అదే ఏడాది నవంబర్ 14న (షెడ్యూలు కంటే ఆరునెలల ముందే) శాసనసభ రద్దుచేసి, 2004 మే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు.

ఉమ్మడి ఏపీ నుంచి విడిపోయి 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో తొలి శాసనసభ గురువారం రద్దయింది. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో తదుపరి ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. అయితే ఇందుకు ఇంకా సుమారు 9 నెలల గడువు మిగిలి ఉండగానే సీఎం కేసీఆర్ గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి అసెంబ్లీని రద్దుచేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించి వెంటనే ఆ ప్రక్రియ ముగించిన గవర్నర్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇలా ముఖ్యమంత్రుల కోరిక మేరకు ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు, తెలంగాణలో ఒకసారి శాసనసభలు రద్దయ్యాయి.