మీ నాన్నే నీకు స్ఫూర్తి కావాలి!

రాహుల్‌, కావ్య జంటగా నటించిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. రామ్‌ కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత. మణిశర్మ స్వరకర్త. హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. కథానాయకుడు ఎన్టీఆర్‌ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పటిదాకా నా చిత్రాల్లో ఎక్కువ సినిమాలకు ఫైట్‌ మాస్టర్‌గా పని చేసింది విజయ్‌నే. ఫైట్లు బ్యాలెన్స్‌ అండ్‌ సేఫ్టీగా ఎలా చేయాలనే మెళకువలను ఆయన వద్ద నేర్చుకున్నాను. ప్రేక్షకులు తెరపై ఫైట్స్‌ చేసే మమ్మల్ని చూస్తున్నారు గానీ తెరవెనుక మాతో ఫైట్స్‌ చేయించే వాళ్లను పట్టించుకోవడంలేదు. విజయ్‌ కష్టపడి ఈ దశకి చేరారు. అమ్మానాన్నల కష్టం, నిజాయతీ వారి పిల్లలకూ వచ్చింది. రాహుల్‌ వేరెవరినో కాదు, తన నాన్న కష్టాన్నే గుర్తు చేసుకునీ, ఆ స్ఫూర్తితోనే ఎదగాలి. అమ్మానాన్నల ప్రేమ, నిజాయతీతో సాధన చేసినంత కాలం విజయం వెన్నంటే ఉంటుంది. రాహుల్‌ చక్కగా చేశాడని ప్రచార చిత్రమే చెబుతోంది. మంచి చిత్రంగా నిలవాలి. నాకిష్టమైన మూలుగలను తన భార్యతో ప్రత్యేకంగా వండించి ప్రేమతో తెచ్చి తినిపించేవాడు విజయ్‌. అందువల్లనే లావుగా ఉండేవాణ్ని. నాపై ప్రేమ కురిపించిన వీరి పిల్లల సినిమా ఆడియో వేడుకకి ప్రేమతో వచ్చాను. మణిశర్మ స్వరాలు వినసొంపుగా ఉన్నాయ’’న్నారు. రాహుల్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంతో నన్ను నిలబెట్టాలని నాన్న కష్టపడుతున్నారు. ఎన్టీఆర్‌ విజయాల్ని ఆస్వాదిస్తారు. అపజయాల్ని చక్కగా హ్యాండిల్‌ చేస్తారు. అందుకే ఆయనంటే నాకిష్టం. మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకి బలమ’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సుకుమార్‌ నా గురువు. ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఆడియో వేడుకప్పుడు నాకు ఈ కథ స్ఫురించింది. ఈ ఆడియో ఆవిష్కరణ ఎన్టీఆర్‌ చేతుల మీదుగా జరగడం ఆనందంగా ఉంద’’అన్నారు. విజయ్‌ మాస్టర్‌ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌ ఈ వేడుకకి రావడంతో నా ఆనందం ఆకాశమంతయింది. నాకు సినీ జీవితాన్నిచ్చింది కథానాయకుడు శ్రీహరి. ఆయన్ని ఎప్పటికీ మరువను. మా సినిమాని ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. కార్యక్రమంలో ఆకాష్‌, శాంతి శ్రీహరి, మేఘాంశ్‌, శశాంక్‌, శ్రీని వాసరావు, శ్రీధర్‌, రామ్‌లక్ష్మణ్‌, కావ్య, శ్యామ్‌ కె.నాయుడు, రమ్య, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.