మీ కుమారుడు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ భాగోతంపై చర్చిద్దామా?: కన్నాకు బుద్ధా సవాల్

ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పని చేసి వందల ఎకరాల భూమిని మీరు కాజేయలేదా? అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. కన్నాకు మించిన భూబకాసురుడు రాష్ట్రంలో మరెవరైనా ఉన్నారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన ఐదు లక్షల ఎకరాల భూ కబ్జాలో కన్నా పాత్ర ఎంతని ప్రశ్నించారు. నిజాయతీగా పాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత కన్నాకు లేదని అన్నారు.

సైకిల్ పై తిరిగిన కన్నాకు భవంతులు, ఢిల్లీలో ఫ్లాట్స్ ఎలా వచ్చాయని బుద్ధా ప్రశ్నించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కన్నాకు మించిన కళంకిత మంత్రి మరెవరైనా ఉన్నారా? అని అడిగారు. మీ కుమారుడు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ భాగోతంపై చర్చకు సిద్ధమేనా? అని కన్నాకు సవాల్ విసిరారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల స్క్రిప్ట్ చదువుతూ… చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.