మీ కదలికల వివరాలన్నీ గూగుల్‌ ఖాతాలో నిక్షిప్తం

బయటపడిన గోప్యత లోపం
గూగుల్‌ సేవల్లో గోప్యతకు భంగం కలిగించే మరో లోపం బయటపడింది. గూగుల్‌ వినియోగదారులు ఎప్పుడు ఎక్కడ ఉన్నదీ చరిత్ర మొత్తం గూగుల్‌ ఖాతాలో నిక్షిప్తమయిపోతుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీరుండే చోటును నిల్వ చేయడానికి వీల్లేకుండా మీటను మార్చుకున్నా సరే కొన్ని రకాల గూగుల్‌ సేవలను యాండ్రాయిడ్‌ పరికరాల్లో, ఐఫోన్లలో ఉపయోగించిననప్పుడు మీ కదలికల చరిత్ర నిక్షిప్తమయిపోతుంది. ప్రిన్స్‌టన్‌కు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించినట్లు ఏపీ వార్తా సంస్థ తెలియజేసింది.
దారులు వెదుక్కోవడానికి గూగుల్‌ మ్యాప్స్‌లాంటి యాప్‌లను ఉపయోగించినప్పుడు మీరుండే చోటును యాప్‌ తెలుసుకోవడానికి అనుమతించాల్సిందిగా గూగుల్‌ కోరుతుంది. అందుకు మీరు అంగీకరిస్తే మీ రోజువారీ కదలికల చరిత్రను ‘టైమ్‌లైన్‌’ రూపంలో గూగుల్‌ మ్యాప్స్‌ చూపిస్తుంది. ప్రయాణంలో ప్రతి నిమిషమూ ఇలా నిల్వ చేయడం వల్ల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉంది. అదే సమయంలో నేరగాళ్లను పట్టుకోవడానికి పోలీసులకు ఉపకరిస్తుంది కూడా.
లొకేషన్‌ చరిత్రను ఎప్పుడైనా మీరు ఆపివేయవచ్చని, ఆపివేస్తే మీరు వెళ్లే ప్రదేశాల వివరాలు నిక్షిప్తం కావని ఈ అంశంపై గూగుల్‌ సపోర్ట్‌ పేజీలో ఉంది. కానీ అది నిజం కాదు. లొకేషన్‌ చరిత్ర మీటను ఆపేసినా కొన్ని గూగుల్‌ యాప్‌లు మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నదీ సమాచారాన్ని మీ అనుమతి అడగకుండానే నిల్వ చేస్తాయి. ఉదాహరణకు మ్యాప్స్‌ యాప్‌ను తెరవగానే మీరెక్కడున్నదీ చూపించే స్నాప్‌షాట్‌ను నిల్వ చేసేస్తుంది. వాతావరణ సమాచారాన్ని స్వయంచాలితంగా తాజాపర్చే యాండ్రాయిడ్‌ ఫోన్‌ యాప్‌లు మీరు ఎక్కడ ఉన్నదీ గుర్తిస్తాయి. ప్రదేశంతో సంబంధమే లేని ‘చాకొలేట్‌ చిప్‌ కుకీస్‌’, కిడ్స్‌ సైన్స్‌ కిట్స్‌’ వంటి అన్వేషణలు మీరుండే అక్షాంశ, రేఖాంశాలను కచ్చితత్వంతో గుర్తించి మీ గూగుల్‌ ఖాతాలో సేవ్‌ చేస్తాయి.

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ యాండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సాఫ్ట్‌వేర్‌పై పని చేసే ఉపకరణాలను ఉపయోగించే రెండు వందల కోట్ల మందికిపైగా వినియోగదారులు, గూగుల్‌పై మ్యాప్స్‌ కోసమో, అన్వేషణ కోసమో ఆధారపడే కోట్ల మంది ఐఫోన్‌ వినియోగదారులపై గోప్యత అంశం ప్రభావం చూపుతోంది.

లొకేషన్‌ చరిత్ర నిక్షిప్తం కాకుండా చూసుకోవడానికి ఒకే మార్గం ఉంది. ‘వెబ్‌ అండ్‌ యాప్‌ యాక్టివిటీ’ మరో సెట్టింగ్‌ ఉంటుంది. గూగుల్‌ యాప్స్‌, వివిధ వెబ్‌సైట్ల నుంచి అందే సమాచారాన్ని ఈ సెట్టింగ్‌.. మీ గూగుల్‌ ఖాతాలో నిల్వ చేస్తుంది. దీన్ని ఆపేస్తే ఏ సమాచారమూ గూగుల్‌ ఖాతాలో నిల్వ అవదు. వెబ్‌ అండ్‌ యాప్‌ యాక్టివిటీని ఆపకుండా లొకేషన్‌ చరిత్ర మీటను మాత్రమే ఆపితే మీ కదలికల వివరాలు గూగుల్‌ఖాతాకు చేరకుండా ఆగవు.