మసకబారిన మాగాణం

మూడేళ్ల నుంచీ సాగునీరు లేక నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టు మాగాణిలో 95వేల ఎకరాల వరకు బీడుగా మారింది. అందులో నిలువెత్తు కంపచెట్లు పెరిగాయి. మాగాణి కాస్త మెట్టగా మారిపోతోంది. కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటల బాట పట్టినా అవీ కలిసి రావడం లేదు. పత్తికి గులాబీరంగు పురుగు, కంది, జూట్‌ తదితర పంటలకు ధర దక్కడం లేదు. మూడేళ్లుగా నీరివ్వకపోవడం వల్ల ఆయకట్టు పరిధిలోని 61 మండలాల రైతులు రూ.3,260 కోట్ల వరి ఉత్పత్తిని నష్టపోయారు. ధాన్యపు రాశులతో కళకళలాడే నట్టిళ్లలోకి.. పట్టణాల నుంచి తెచ్చిన పాతిక కిలోల బియ్యం బస్తాలు వచ్చాయి. పాడి పశువులకు మేత లేక లారీలలో తెప్పించుకోవాల్సిన దుస్థితి. వ్యవసాయ కూలీలు ఉపాధి వెదుక్కుంటూ పట్టణాలకు వలస పోతున్నారు.
నీరందక కుడికాలువ ఆయకట్టులోని మాగాణిలో 22 శాతం బీడుగా మారింది. పశువులు మేపడానికే ఉపయోగపడుతున్నాయి. సత్తెనపల్లి, ముప్పాళ్ల, రొంపిచర్ల ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, అద్దంకి, సంతమాగులూరు ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉంది.

మాగాణి నుంచి పత్తికి..
దర్శి మండలంలో మూడేళ్లుగా ఆయకట్టులో మెట్ట పంటలసాగు పెరుగుతూ వస్తోంది. గట్లు పగలగొట్టి మెట్టగా మార్చాలంటే ఎకరాకు రూ.2వేలకు పైనే ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట, గురజాల, చిలకలూరిపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి తదితర నియోజకవర్గాల పరిధిలో మాగాణి భూముల్లో పత్తి, మొక్కజొన్న సాగు భారీగా పెరిగింది. నీరొచ్చినప్పుడు వీటిని మళ్లీ మాగాణిగా మార్చాలంటే ఎకరాకు రూ.5వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని గుంటూరు జిల్లా కొమెరపూడి రైతు ఎర్రా శివయ్య వివరించారు.