మరణశిక్షకు 1000.. జీవిత ఖైదుకు 500!

కోర్టు కేసు వ్యవహారం అనగానే ఏళ్లకు ఏళ్లు పడుతుందనేది సగటు మనిషి అభిప్రాయం. అందులోనూ అత్యాచార ఘటనల విషయంలో విచారణ అనగానే తీర్పు ఎప్పుడు వెలువడుతుందన్నదీ అనుమానమే. కానీ, మధ్యప్రదేశ్‌లో ఇటీవల అత్యాచార కేసుల విచారణ త్వరితగతిన పూర్తవుతున్నాయి. మృగాళ్లకు కొన్ని రోజుల్లోనే శిక్ష పడుతోంది. గడిచిన 8 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 మందికి మరణశిక్ష పడింది. ఈ ఏడాది జూన్‌లో ఓ ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరికి మందసౌర్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం మరణశిక్ష విధించడం బట్టి కేసుల సత్వర పురోగతిని అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక ప్రభుత్వం కృషి ఎంతో ఉంది. ఆ రాష్ట్రం చేపట్టిన వినూత్న విధానమే దీనికి కారణం. అదే పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు పాయింట్ల విధానం!

దీని ప్రకారం.. న్యాయవాదులకు తాము వాదించే కేసుల విషయంలో ప్రభుత్వం కొన్ని రివార్డు పాయింట్లను ఇస్తుంది. ఒకవేళ నిందితుడికి మరణశిక్ష పడితే 1000 పాయింట్లు, జీవిత ఖైదు పడితే 500 పాయింట్లు, జైలు శిక్ష పడితే 100 నుంచి 200 పాయింట్లు కేటాయిస్తున్నామని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ నెలలో ఒక ప్రాసిక్యూటర్‌ 500 కంటే తక్కువ పాయింట్లను పొందినట్లయితే ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ‘ఈ ప్రాసిక్యూషన్‌’ పేరిట ఒక యాప్‌ను రూపొందించింది. ఇందులో సుమారు వెయ్యి మంది ప్రాసిక్యూటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ఈ విధానం సత్ఫలితాలనిస్తోంది. నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 14 ఏళ్ల మైనర్‌కు ఛార్జిషీట్‌ దాఖలు చేసిన 7 గంటల్లోనే ఉజ్జయిన్‌ కోర్టు సోమవారం తీర్పు వెలువరించించడం ఇక్కడ గమనార్హం.

దేశంలో 2016లో మొత్తం 38,947 అత్యాచార కేసులు నమోదవ్వగా ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 4,882 ఘటనలు జరగడం గమనార్హం. ఇలాంటి ఘటనల్లో మధ్యప్రదేశ్‌ దేశంలోనే తొలిస్థానంలో ఉందని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో తన నివేదికలో పేర్కొంది. దీంతో అత్యాచారాలను అరికట్టే ఉద్దేశంతో ఆ రాష్ట్రం 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చింది.