identity mirrotoday

మనో ధైర్యం

ఈ మధ్య ఒక మిత్రుడు 498 ఏ బాధితుడయ్యాడు . అంటే కొత్తకోడలు పెట్టిన కేసు , పొలిసు స్టేషను , కోర్టులు , గొడవలు .
సహజంగా ఇలాంటి సందర్భంలో చట్టం కోడలికే చుట్టం . అత్త మామ భర్త ఇంకా పేరుతెలిసిన అందరినీ కేసులో ఇరికించి కొ కో ఆడుకుంటోంది కొ కో – అనగా కొత్త కోడలు . నా మిత్రుడు చాలా మంచివాడు , అమాయకుడు , పేదవాడు , లోకంపోకడ తెలియనివాడు . తెలుగునుండి ఇంగ్లీషు , ఇంగ్లీషునుండి తెలుగులోకి అయన అనువాదానికి , అనువాద వేగానికి , మూలం స్పిరిట్ దెబ్బతినకుండా అల్లే అల్లికకు , పెట్టే శీర్షికలకు నేను అభిమానిని , నేర్చుకునే విద్యార్థిని .

కానీ పేదరికం చాలాసార్లు ఆత్మవిశ్వాసాన్ని , సహజంగా ఉన్న నేర్పును తొక్కేసి నైరాశ్యంలోకి నెట్టేస్తుంది . అసలే పదవి విరమణ తరువాత ఆర్థికంగా చితికి ఉన్నాడు . ఈలోపు గోరుచుట్టుపై కొ.కో. కేసు పోటు . అంతులేని వైరాగ్యంలో నాకు మెసేజు పెట్టాడు . నా ప్రయత్నంగా ఏమి చేశానన్నది ఇక్కడ అప్రస్తుతం . సుందరకాండలో అనిర్వేదో . . . అని హనుమ చెప్పే గొప్ప శ్లోకం ఒకటి . నిర్వేదమే మరణం . ఉత్సాహమే జీవనం .

సీతమ్మ అన్న మాట – యేతి జీవంత మానందో నరం వర్ష శతాదపి . . వందేళ్లు ఆయుష్షు కాబట్టి , 99 ఏళ్ళు కష్టాలున్నా వందో సంవత్సరం బాగుంటుందన్న ఆశతో బతకాలి , ఆశను బతికించుకోవాలి . అన్నట్టు నా మిత్రుడి బాధ చెప్పగానే , ఉపశమనానికి దారి చూపినవాడు మరోమిత్రుడు . ఈ పుణ్యంలో నాకు భాగం లేదు . మా ఆఫీస్ ఉన్న బంజారాహిల్స్ జిలుగువెలుగుల వెనుక అక్కడే అడ్డామీద రోజు కూలీల్లో కనిపించే అంతులేని ఆత్మవిశ్వాసం చూస్తే నాకు ఎప్పుడూ పులకింతగా , ఉత్సాహంగా , రేపటిమీద ఆశగా ఉంటుంది .

ఆఫీసులో పెంచుకునే కుక్కను తీసుకెళ్లి వారిపక్కన కాసేపు నిలుచుంటాను . ఉదయం 8 గంటలకు రోడ్డు మీదికి వస్తారు . మేస్త్రీలు వచ్చి పిలుస్తుంటారు . మద్యాహ్నం 12 గంటల వరకు నిరీక్షిస్తుంటారు . ఎవరూ పిలవకపోతే వెనక్కు వెళ్ళిపోతారు . ఎండా వాన గాలి చలి ఎలా ఉన్నా అలాగే నిరీక్షిస్తుంటారు . తెలంగాణ ఎన్నికలు భవితవ్యం గురించి వారి మాటలు దెప్పిపొడుపులు వెయ్యి సంపాదకీయాలు , లక్ష సర్వే లకన్నా ఖచ్చితంగా ఉన్నాయి . ఉన్నతంగానూ ఉన్నాయి . కూలిదొరక్కపోతే ఏమి చేస్తారు అని అడిగితే – అదో అర్థంలేని , ఆలోచించాల్సిన అవసరంలేని ప్రశ్నగా బదులిస్తారు . ఉంటే చేస్తాం , తింటాం , తాగుతాం . లేదంటే ఊరికే ఉంటాం అంటారు . వారి ప్రపంచం వారిది . మనకళ్లతో వారిని చూడకూడదు . ఒక్కరిపేరు ఊరు కూడా నాకు తెలియదు . కానీ,వారినుండి నేర్చుకునేవారికి నేర్చుకున్నంత . దిగులు , విసుగు , నైరాశ్యం లేకుండ కొత్త రోజుకోసం కోటిఆశలతో ఎదురుచూస్తుంటారు . లోపల ఎన్ని కన్నీళ్లు కష్టాలు దిగమింగుకుని అలా ఉంటున్నారోకానీ , వారి మనోధైర్యంలో పదోవంతు అందిపుచ్చుకున్నా నిరాశాలోకం లేచి నిలుచుని ఆకాశాన్ని ముద్దాడుతుంది .

-పమిడికాల్వ మధుసూదన్