భయపడే వాళ్లే విమర్శలు చేస్తున్నారు!

సాహసోపేతమైన విలక్షణ పాత్రలకు చిరునామా కమల్‌హాసన్. ఏ పాత్ర చేసినా దానికి పరిపూర్ణతను చేకూర్చి విశ్వనటుడిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారాయన. పసి ప్రాయం నుంచి కమల్ నట ప్రస్థానం సవాళ్లతోనే సాగింది. వెండితెర నటరాజుగా జేజేలందుకున్న ఆయన మక్కల్ నీది మయ్యమ్ పేరుతో కొత్త పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. రాజకీయ ప్రవేశం అనంతరం కమల్‌హాసన్ నటించిన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన విశ్వరూపం-2ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కమల్‌హాసన్ గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

విశ్వరూపంవివాదాలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్‌గా వస్తున్న రెండవ భాగానికి నాలుగేళ్లు పట్టడానికి కారణం?
-రాజకీయంతో పాటు తార్కికమైన కొన్ని కారణాలు అవరోధంగా నిలిచాయి. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. ఇప్పటికైనా విడుదలవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా విషయంలో కొన్ని భయాలు నన్ను వెంటాడాయి. ఈ మోడ్రన్ యుగంలో సినిమా జీవిత కాలం రెండు మూడు వారాలే. ఇలాంటి సమయంలో మా సినిమా నాలుగేళ్లు ఆలస్యంగా వస్తున్నదంటే అంతా మర్చిపోతారేమోనని భయపడ్డాను. కానీ ఇప్పుడే పూర్తయి రిలీజ్ అవుతున్న చిత్రానికి ఎలాంటి ఆసక్తిని కనబరుస్తారో మా సినిమా కోసం అలాంటి ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నందుకు ఆనందంగా వుంది.

తొలి భాగానికి ఇది కొనసాగింపు అనుకోవచ్చా?
-తప్పకుండా ఇది తొలి భాగానికి కొనసాగింపే. అందులో ఎలాంటి అనుమానం లేదు. రెండు భాగాల్లో కథ చెప్పాలని ముందే అనుకున్నాం. అనుకున్నట్లుగానే రెండవ భాగాన్ని రూపొందించాం. నాలుగేళ్ల క్రితమే చిత్రీరణ మొత్తం పూర్తయింది. గత ఏడాదే నిర్మాణానంతర కార్యక్రమాలు మొదలుపెట్టాం. సాంకేతికంగా కూడా చాలా అడ్వాన్స్‌గా వుండే చిత్రమిది. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా చిత్రాన్ని తెరకెక్కించాం.
రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత విశ్వరూపం-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఎలా వుంది?
-రాజకీయానికి, సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. దేని దారి దానిదే. రాజకీయం అనేది నాకు లభించిన మరో వేదిక.

విశ్వరూపం-3 తీయాలనే ఆలోచన ఏదైనా వుందా?
-ఇంకా ఏమీ అనుకోలేదు. ఈ రెండు భాగాల్ని విజయవంతంగా పూర్తి చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. నేను చేయాల్సిన పనిని విజయ వంతంగా పూర్తి చేశాననే సంతృప్తి కలిగింది. తొలి భాగంలో భావోద్వేగాలకు ఎక్కువ ఆస్కారం లేదు. అందుకే రెండవ భాగంలో దానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాను. తొలి భాగంలో వదిలేసిన అన్ని ప్రశ్నలకు ఈ భాగంలో సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను. అంతర్జాతీయ తీవ్రవాదం నుంచి దేశాన్ని వీసమ్ అహ్మద్ కశ్మీరీ తన దేశాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ చిత్ర కథ. వహీదా రెహమాన్ ఈ చిత్రంలో నాకు తల్లిగా కీలక పాత్రలో నటించారు. ఆమె పాత్ర ఎలా వుంటుంది అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది.

కానీ మళ్లీ మరో కమల్‌హాసన్ రాలేరు కదా?
-నా లాంటి వారు రాలేరేమో కానీ నా కన్నా ప్రతిభావంతులు మాత్రం తప్పకుండా వస్తారు. అలాంటి వ్యక్తులు రావడానికి మా వంతు సహాయం చేయాల్సిన బాధ్యత మాపై వుంది. సాగరసంగమం చివర్లో ఆర్ట్ నెవర్ ఎండ్ (కళకు ముగింపు లేదు) అనే టైటిల్ పడుతుంది. ఒక మనిషితోనే ఏదీ ముగిసిపోదు. బాలచందర్‌గారి వద్ద పనిచేస్తున్నప్పుడు స్టార్‌లు పుట్టడం చూశాను. వాళ్లే డెమీగాడ్స్‌గా కీర్తింపబడటాన్ని కూడా చూశాను.

భారతీయ సినిమాల్లో సృజనాత్మక స్వాతంత్య్రం ఎంత వరకు వుందని భావిస్తున్నారు?
-మన దేశంలో సినిమాల పరంగా సృజనాత్మక స్వాతంత్య్రం చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఒక సినిమా కోసం చాలా చర్చలు చేయాల్సిన పరిస్థితి. సినిమా సెన్సార్ విధానాన్ని మార్చాలని ప్రయత్నాలు చేశాం. వాక్ స్వాతంత్య్రం పరంగా ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఎంతో వుంది.

తొలి భాగం వివాదాస్పదమైంది. రెండవ భాగంపై కూడా వివాదాలు తలెత్తే అవకాశం వుందా?
-తొలిభాగం విడుదల సమయంలో సినిమాపై కొంత మంది పనిగట్టుకుని విష ప్రచారం చేశారు. దాంతో సినిమా చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. కానీ ప్రస్తుతం వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. నేను రాజకీయాల్లోకి రావడం కూడా ఓ కారణం కావచ్చు.

నాలుగేళ్లు ఆలస్యం కావడంతో స్క్రిప్ట్‌లో మళ్లీ ఏమైనా మార్పులు చేర్పులు చేశారా?
-ముందు అనుకున్న కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. నేను ఏదైతే అనుకున్నానో దాన్నే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను. చిన్న చిన్న మార్పులు తప్ప మళ్లీ కథలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

భారతీయతపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది. ఈ విషయాన్ని చర్చించే స్థాయిలో మీ సినిమా వుంటుందనుకోవచ్చా?
-తప్పకుండా వుంటుంది. అర్థరహితమైన విమర్శలు చేసే రాజకీయ నాయకులు వున్నంత కాలం మా లాంటి ఫిల్మ్ మేకర్స్‌కు పని ఎప్పుడూ వుంటుంది. మీ దృష్టిలో భారతీయత అంటే ఏమిటి? నా దేశాన్ని నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే వుంటాను. అలా దేశాన్ని ప్రేమించమని చెప్పే అధికారం మిగతా వారికి ఎక్కడిది? కొంత మంది భారతీయతకు కొత్త అర్థాన్ని ఆపాదిస్తున్నారు. దేశ విభజనకు ముందు భారతీయత అంటే ఏమిటి? ఒకప్పుడు ఇండియా నుంచి పాకిస్థాన్ విడిపోక ముందు పెషావర్ మనదే కానీ ఇప్పుడు కాదు కదా?. దేశభక్తి గురించి చాలా వేదికలపై చర్చలు జరగాల్సిన అవసరం వుంది.