బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్!

 

  • కొత్త నిబంధనను ప్రకటించిన ఆర్‌బీఐ
  • బ్యాంకులు వాటి రుణాలను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయాలి
  • రెపో రేటు తగ్గింపు ప్రయోజనాలను బ్యాంకులు కస్టమర్లకు  సక్రమంగా  బదిలీ చేయకపోవడం కూడా కారణం
  • రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు తీపికబురు అందించింది. బ్యాంకులు అవి ఆఫర్ చేసే పర్సనల్ లోన్స్, రిటైల్ లోన్స్, ఫ్లోటింగ్ రేటు రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది.  ఆర్‌బీఐ కీలక రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు కూడా వేగంగా ఆ తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. కేంద్ర బ్యాంక్ (ఆర్‌బీఐ) వరుసగా రెపో రేటు తగ్గించుకుంటూ వస్తుంటే.. బ్యంకులు మాత్రం ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు బదిలీ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి.

    ఆర్‌బీఐ ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. బ్యాంకులు అవి జారీ చేసే రుణాలను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్స్ రేటుకు లేదా రెపో రేటుకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఏ బెంచ్‌మార్క్‌ను ఎంచుకోవాలనే అంశం బ్యాంకుల ఇష్టం.  కొన్ని షరతులు వర్తిస్తాయి. దీంతో రెపో రేటు తగ్గినప్పుడల్లా రుణ రేట్లు కూడా దిగివస్తాయి. దేశీ స్థూల దేశీయోత్పత్తి ప్రస్తుత క్యూ1లో ఆరేళ్ల కనిష్ట స్థాయి 5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రైవేట్ వినియోగం గణనీయంగా పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఆర్‌బీఐ గత మానిటరీ పాలసీ సమీక్షలో కీలక రెపో రేటును ఏకంగా 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు 5.4 శాతానికి దిగొచ్చింది. 2019లో ఆర్‌బీఐ నాలుగు సార్లు వడ్డీ రేట్లు తగ్గించింది. మొత్తంగా రెపో రేటు 1.1 శాతం దిగొచ్చింది.