బ్యాంక్‌ డీఫాల్టర్‌లపై సీబీఐ కొరడా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కుంభకోణాలు, మోసాలకు సంబంధించి సీబీఐ మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. బ్యాంకు రుణ ఎగవేతదారులు లక్ష్యంగా మొత్తం 12 రాష్ట్రాల్లో సీబీఐ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా బ్యాంక్‌ డీఫాల్టర్‌లపై 14 కేసులను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వివిధ కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లపై సమన్వయంతో ఏకకాలంలో 18 వేర్వేరు నగరాల్లో 50 చోట్ల ఏజెన్సీ బృందాలు సోదాలు నిర్వహించినట్లు ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.14,356 కోట్ల కుంభకోణం తర్వాత సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు బ్యాంకింగ్‌ సంస్థలపై నిఘా వేశాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం, 2018-19లో రూ. 71,500 కోట్లకు సంబంధించి 6,800కుపైగా కేసులు నమోదయ్యాయి.