బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలిక

ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ఈ సంఘటన బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో నిన్న మధ్యాహ్నం చోటు చేసుకుంది. దీంతో ఆ బాలికను ప్రాణాలతో కాపాడేందుకు సహాయక సిబ్బంది చర్యలు కొనసాగిస్తుంది. ఉమేష్ నందన్‌లో నివాసముంటున్న తన తాత ఇంటికి మూడేళ్ల చిన్నారి శానో వచ్చింది. శానో ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 110 ఫీట్ల లోతున్న బోరుబావిలో పడిపోయింది. బోరుబావిలో పడిన బాలిక గట్టిగా కేకలు వేయడంతో అందరూ అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న విపత్తు నిర్వహణ అధికారులు, పోలీసులు బాలికను రక్షించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వారు. ఆక్సిజన్‌ను బోరుబావిలోకి సరఫరా చేస్తున్నారు. బాలికకు శక్తి ఇచ్చేందుకు గ్లూకోజ్, వాటర్‌ను పంపారు. అయితే తల్లి మాటలకు బాలిక స్పందిస్తుందని అధికారులు వెల్లడించారు. శానో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.