బెంగాల్ ముఖచిత్రాన్ని మార్చేస్తుందా !

ఆనందోపాఖ్యానం
ఆ ఒక్క నినాదం ప‌శ్చిమ బెంగాల్ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్ని త‌రాలుగా మార్చేస్తోంది. 1977 దాకా బెంగాల్ అధికారాన్ని త‌మ చేతిలో ఉంచుకున్న కాంగ్రెస్, బెంగాల్ కాంగ్రెస్ పార్టీల‌ను ఆ నినాదం అడ్డంగా ముంచేసింది. 1960లో అమెరికా, వియ‌త్నాం యుద్ద స‌మయంలో వియ‌త్నాం ప్ర‌జ‌ల‌కు సంఘీభావంగా కామ్రేడ్లు బెంగాల్లోని ప‌లు ప‌ట్ట‌ణాల్లో ర్యాలీలు తీశారు. అప్పుడు వారు చేసిన నినాదం తుమారా నామ్, హ‌మారా నామ్ వియ‌త్నాం, వియ‌త్నాం. అంటే నీ పేరు, నా పేరు వియ‌త్నాం, వియ‌త్నాం. ఇది ఆ రోజుల్లో జ‌నానికి బాగా ఎక్కింది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ నిర్య‌క్ష పాల‌న‌తో విసిగిన జ‌నం, నెమ్మ‌దిగా క‌మ్యూనిస్టుల వైపు మొగ్గు చూపారు. ఆ త‌ర్వాత ప‌లుమార్లు రాష్ట్ర‌ప‌తి పాల‌న దిశ‌గా బెంగాల్ రాజ‌కీయం న‌డిచినా, 1977లో సీపీఎం నాయ‌క‌త్వంలో కామ్రేడ్ల పాల‌న మొదైలంది. 2011 దాకా అది కొన‌సాగింది. ఈ సుదీర్ఘ పాల‌న‌కు నాంది ప‌లికింది తుమారా నామ్, హ‌మారా నామ్ వియ‌త్నాం, వియ‌త్నాం నినాద‌మే. ఇక కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్ పార్టీల‌కు వ్య‌తిరేకంగా 1998 జ‌న‌వ‌రి 1వ తేదీన మ‌మ‌త బెన‌ర్జీ స్థాపించిన ఆలిండియా త్రుణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ, 2006లో అప్ప‌టి సీఎం బుద్ధ‌దేవ్ భ‌ట్టాచార్య ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేశారు. సింగూర్ అంశాన్ని తీసుకున్న ఆమె తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మం చేశారు. అప్ప‌ట్లో ఆమె ఓ స్లోగ‌న్ ప్ర‌చారం చేస్తూ జ‌నంలోకి వెళ్లారు. ఆ నినాదం ఏంటంటే, తుమారా నామ్, హ‌మారా నామ్ నందిగ్రామ్, నందిగ్రామ్. ఈ నినాదం ఆ పార్టీకి ఎక్క‌డ‌లేని బ‌లం ఇచ్చింది. ఇలా జ‌నంలో ఎదిగిన టీఎంసీ, 2011లో అధికారంలోకి వ‌చ్చి, ఇప్ప‌టి దాకా కొన‌సాగుతోంది. వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రావ‌డంతో సీపీఎం నేత‌లు మొద‌ట్లో టీఎంసీలోకి మారారు. కానీ తాజా ప‌రిస్థితుల‌తో వారు ఇప్పుడు బీజేపీలోకి వెళ్తున్నారు. దీనికి కార‌ణం ఒక్క‌టే, మోడీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్ మీద ప‌ట్టుకోసం అమిత్ షా వ్యూహం ర‌చించారు. ఇక 2017లో బీజేపీ, సంఘ్ ప‌రివార్ ఓ నినాదాన్ని జ‌నంలోకి తీసుకెళ్లారు. అదేమంటే, తుమారా నామ్, హ‌మారా నామ్ జై శ్రీరాం, జై శ్రీరాం. ఇది స‌గ‌టు బెంగాలీల‌కు బాగా ఎక్కింది. ఎందుకంటే ముస్లింల ఓట్ల కోసం 2016లో మ‌మ‌త బెన‌ర్జీ తీసుకున్న నిర్ణ‌యాలు, బ‌డ్జెట్ కేటాయింపులు బెంగాలీల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. 2009 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బంగ్లాదేశ్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన ముస్లింల‌ను వెళ్ల‌గొడ‌తానంటూ ప్ర‌చారం చేసిన మ‌మ‌త‌, తాను సీఎం అయిన త‌ర్వాత వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డాన్ని బెంగాలీలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదే స‌మ‌యంలో సంఘ్ ప‌రివార్ తుమారా నామ్, హ‌మారా నామ్ జై శ్రీ రాం, జై శ్రీ రాం నినాదానికి చాలా మంది అభిమానులు అయ్యారు. ప్ర‌జ‌ల నాడిని క‌నిపెట్టిన చాలా మంది సీపీఎం నేత‌లు 2018 నుంచీ బీజేపీలోకి క్యూ క‌డుతున్నారు. ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా తెల్సుకున్న సీపీఎం నేత బుద్ధ‌దేవ్ భ‌ట్టాచార్య, వారించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అప్ప‌టికే ప‌రిస్థితి చేయిదాటి పోయింది. ఇక మోడీ మీద కోపంతో ఉన్న మ‌మ‌త బెన‌ర్జీ ఈ మార్పుల‌ను గ‌మ‌నించ‌లేదట‌. పైగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటే చాల‌న్న ధీమా ఆమెను ఈ ప‌రిణామాల‌ను తేలిగ్గా తీసుకునేలా చేసిందట‌. దీంతో గ‌తేడాది జ‌రిగిన‌ స్థానిక సంస్ధ‌ల ఎన్నిక‌ల‌తో మొన్న‌టి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ గ‌ణ‌నీయ‌మైన స్థానాలు గెల్చుకుంది. అందుకే ఇప్పుడు 2021 ఏడాదిలో జరగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మీద మమత బెనర్జీకి బెంగ పట్టుకుంది.

కాశ్మీర్లో కొత్తసమస్య
కశ్మీర్ లోయలో లక్షలాది మంది బలగాలను మోహరించడం వెనుక భద్రతా పరమైన అంశం ఒక్కటే కాదు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న కొట్లాటలు కూడా కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఇలాంటి పరిస్థితినే అప్పటి ప్రభుత్వాలు ఎదుర్కొన్నాయి. కానీ ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడంలో అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. దాంతో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.తాజా పరిణామాలు చూస్తే లోయలో క‌శ్మీర్ ఉగ్ర‌వాదులు వ‌ర్సెస్ పాకిస్తాన్ నుంచి వ‌స్తున్న‌ ఉగ్ర‌వాదులు ఒక‌రిని  ఒక‌రు చంపుకుంటున్నారు. విన‌డానికి ఇది ఆశ్చ‌ర్యంగా ఉన్నా, ఇప్పుడు క‌శ్మీర్ లోయ‌లో ఇదే జ‌రుగుతోంది. ల‌ష్క‌ర్ ఏ త‌యిబా నుంచి వేరుప‌డిన మూసా అనే ఉగ్ర‌వాది సొంతంగా అన్స‌ర్ ఘ‌జ్వ‌తుల్ హింద్ పేరుతో ఓ ఉగ్ర‌వాద గ్రూప్ మొదలు పెట్టాడు. క‌శ్మీరీల స‌మ‌స్య‌లు తీరాల‌న్నా, ఆజాద్ క‌శ్మీర్ ఏర్ప‌డాల‌న్న సొంతంగా పోరాడాల‌నీ, పాకిస్తాన్ నుంచి వ‌చ్చే ఉగ్ర‌వాదుల‌కు క‌శ్మీర్ మీద అభిమానం ఏమాత్రం లేద‌నీ, కేవ‌లం డ‌బ్బులు, అమ్మాయిలు, భూమి కోస‌మే ఉగ్ర‌వాదులుగా మారుతున్న‌ట్లు మూసా ఆరోపిస్తున్నాడు. అందుకే త‌న గ్రూపు బ‌లోపేతం చేసుకోవ‌డం కోసం హిబ్జుల్ ముజాహిద్దీన్, ల‌ష్క‌ర్ ఏ త‌యిబా గ్రూపుల‌కు చెందిన ఉగ్ర‌వాదుల‌ను చేర్చుకుంటున్నాడు. ఇదే స‌మ‌యంలో హిబ్జుల్ ముజాహిద్దీన్ ఉగ్ర‌వాది అదిల్ అహ్మ‌ద్, తాను మూసా గ్రూపులో చేర‌తానంటూ హిబ్జుల్ నేత‌కు చెప్పాడు. దీంతో తుపాకీ ఇచ్చేసి వెళ్లిపొమ్మ‌న్న హిబ్జుల్ ఉగ్ర‌వాదులు, తుపాకీ ఇచ్చిన త‌ర్వాత అత‌న్ని కాల్చి చంపేశారు. ఈ హ‌త్య వెనుక కార‌ణాలు తెల్సుకున్న ఆర్మీ నిఘా వర్గాల‌కు బిత్త‌ర‌పోయే విష‌యం తెల్సింద‌ట‌. ఉగ్ర‌వాద సంస్థ‌ల నుంచి బ‌య‌ట‌కు వెళ్లే క‌శ్మీరీ యువ‌కుల‌ను కాల్చి చంపాలంటూ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ క‌శ్మీర్ ఉగ్ర‌వాదులు హిబ్జుల్ ముజాహిద్దీన్, ల‌ష్క‌ర్ ఏ త‌య‌బా సంస్థ‌ల‌ను వార్నింగ్ ఇచ్చింద‌ట‌. త‌మ ఆదేశాల‌ను పాటించ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌నీ చెప్ప‌డంతోనే అదిల్ అహ్మ‌ద్ హ‌త్య జ‌రిగిన‌ట్లు తేలింది. అంతేకాదు, క‌శ్మీర్ కోసం పోరాడుతున్నామ‌ని చెబుతున్న హురియ‌త్ కాన్ఫ‌రెన్స్ నేత‌ల‌కు చిత్త‌శుద్ధి లేద‌నీ, వారంతా ప‌నికిమాలిన వాళ్లంటూ ఐసిసి ప్ర‌క‌ట‌న చేసింది. ఇక హిబ్జుల్ ముజాహిద్దీన్ చీఫ్ రియాజ్ నైకో కూడా ఓ ప‌నికిమాలిన నాయ‌కుడిగా చెబుతోంది ఐసిస్. ఆజాద్ క‌శ్మీర్ రావాలంటే తాము చెప్పిన‌ట్లు న‌డుచుకోవాల‌ని కూడా వార్నింగ్ ఇస్తోంద‌ట‌. అంటే ఉగ్ర‌వాద గ్రూపుల మ‌ధ్య చిచ్చు మొద‌లై, ఒక‌రిని మరొక‌రు చంపుకునే దాకా వెళ్లింద‌ని నిఘా వ‌ర్గాలు చెబుతున్నాయి. 1990లో కూడా ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంది. అప్ప‌ట్లో హిబ్జుల్ ముజాహిద్దీన్, అల్ జిహాద్ ఉగ్ర‌వాదుల మ‌ధ్య చాలాకాలం పోరు న‌డిచింది. రెండు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన యుద్ధంలో చాలా మంది ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. అయితే హిబ్జుల్ సంస్థ‌కు పాకిస్తాన్ మ‌ద్ద‌తు బాగా ఉండ‌టంతో అప్ప‌ట్లో అల్ జిహాద్ తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే నెల‌కొంద‌నీ ఆర్మీ భావిస్తోంది. అందుకే ఉగ్ర మూకల మధ్య తగవును ఆర్మీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ వారి మధ్య జరుగుతున్న పోరులో సామాన్యుడు బాలి కాకుండా ఉండేందుకే భారీగా బలగాలను మోహరించినట్లు తెలుస్తోంది.

రాజథాక్ర్ కొత్త అధ్యాయం
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయనో ఫైర్ బ్రాండ్. కానీ ఆయనతో ఎవ్వరు దోస్తీ కట్టరు. అలాగని గొడవ పెట్టుకోరు. ఎందుకంటే ఆయన స్నేహంతో లాభం కంటే, గొడవతో వచ్చే నష్టమే ఎక్కువ. ఆయనే రాజ్ థాకరే. బాల్ థాకరే అడుగుజాడల్లో శివసేనలో బాధ్యతలు నిర్వహించిన రాజ్, సోదరుడు ఉద్ధవ్ థాకరే ఆలోచనలతో విభేదించారు. 2006లో శివసేనకు గుడ్ బై కొట్టి సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పేరుతో పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి మహా రాజకీయాల్లో తనదైన శైలిలో వెళ్తున్న రాజ్ థాకరేకు ఈ ఎన్నికలు ఇరకాటంలో పెట్టాయి. ఎందుకంటే మొన్నటి ఆగష్టులో అయన మీద ఈడీ సోదాలు జరిగాయి. అప్పటి నుంచి నెల రోజుల పాటు బయటకు రాని రాజ్, కేవలం ఎన్నికలు మరో పదిహేను రోజులు ఉన్న సమయంలో ప్రచారం మొదలు పెట్టారు. అందులో కూడా తన పార్టీ అధికారంలోకి రాదని చెబుతున్న రాజ్ థాకరే, బలమైన, నమ్మకమైన ప్రతిపక్షం కావాలంటే తన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మొత్తం 288 సీట్లలో కేవలం 104 చోట్లే పోటీ చేస్తోంది. రాజ్ పార్టీ. ఐతే ఒకప్పుడు రాజ్ థాకరేని అభిమానించిన వారే, ఇప్పుడు ఆయన మీద కోపంగా ఉన్నారట. ఎందుకంటే ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద అనవసరంగా నోరు పారేసుకోవడమే కారణంగా జనం చెబుతున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో రాజ్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియని పరిష్టితి ఏర్పడింది. మరో విషయం ఏంటంటే, పొత్తులో భాగంగా బీజేపీ 164 చోట్ల, శివసేన 124 చోట్ల పోటీ చేస్తున్నాయి. దీని మీద కూడా రాజ్ థాకరే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తక్కువ సీట్లు తీసుకోవడం అంటే, శివసేన అధినేత ఉద్దవ్ థాకరే తన చేతకానీ తనాన్ని ఒప్పుకోవడమే అంటున్నారు. మీ పార్టీ సంగతి చూసుకోకుండా వేరే వాళ్ల రాజకీయం ఎందుకన్న ప్రశ్నకు అయన నుంచి సమాధానం కరువైంది. అంతేకాదు, 2009 లోక్ సభ ఎన్నికల్లో 13 సీట్లు గెల్చుకున్న రాజ్ పార్టీ, 2014 ఎన్నికల్లో కేవలం ఒకేఒక సీటులో నెగ్గింది. గెలిచినా ఎంఎల్ఏ కూడా తర్వాత శివసేనలోకి మారిపోయాడు. ఈ వాస్తవాలను గ్రహించకుండా, తమ నేతలను బెదిరిస్తున్నారంటూ ఎంఎంఎస్ అధినేత ఆగ్రహం వ్యక్తం చేయడం మహారాష్ట్ర ప్రజలకు నవ్వు తెప్పిస్తోందట.

Leave a Reply