prostitution in 5 star hotels

ఫైవ్ స్టార్ హోటల్లో అనైతికం!

బంజారాహిల్స్‌లోని పంచతార హోటల్‌.. సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాయలం.. ఈ రెండింటికీ సంబంధం లేదు.. ఒక చిన్న సమాచారంతో ఉత్తర మండలం పోలీసులు ఆ పంచతార హోటల్‌కు వెళ్లారు. సమాచారం ఆధారంగా ఓ గదిలోకి వెళ్లి తలుపుతట్టారు. ఓ యువతి.. ఓ పురుషుడు గదిలో ఉన్నారు. భార్యాభర్తలా? అని ప్రశ్నించగా.. నీళ్లు నమిలారు. వివరాలు సేకరించగా.. పురుషుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అమిత్‌ మహేంద్రశర్మ, భోజ్‌పురి సినిమాల్లో నటిస్తున్న కథానాయికగా ఆ యువతిని గుర్తించారు. వీరు తెలిపిన వివరాలతో వ్యభిచారం నిర్వహిస్తున జనార్దన్‌రావు అలియాస్‌ జానీని అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌
..కొద్దిరోజుల కిందట నగరంలో సంచలనం సృష్టించిన వ్యవహారమిది. ఇలాంటి సంఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. సెక్స్‌ రాకెట్ల నిర్వహణ విచ్చలవిడిగా కొనసాగుతోంది. అనైతిక కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించే దళారీలు.. వ్యక్తులు వ్యవస్థీకృతంగా మారి పోలీసులకు దొరక్కుండా వీటిని కొనసాగిస్తున్నారు. పంచతార హోటళ్లు.. స్పాలు.. సంపన్నుల ప్రాంతాల్లో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. విటులను ఆకర్షించేందుకు నిర్వాహకులు రష్యా, నేపాల్‌, ఇండోనేషియాల్లో ఉంటున్న యువతులను డబ్బుతో ప్రలోభపెట్టి రప్పిస్తున్నారు. బాలీవుడ్‌లోని జూనియర్‌ నటీమణులు, కోల్‌కత, దిల్లీ, ముంబయి నగరాల్లో ఖరీదైన సెక్స్‌వర్కర్లను రప్పిస్తున్నారు. మరి కొందరిని తాత్కాలిక ఉద్యోగుల పేరుతో ఇక్కడికి రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. ఐపీఎస్‌లు.. ఐఏఎస్‌లు నివసించే ప్రశాసన్‌నగర్‌లో డూప్లెక్స్‌ ఇల్లు తీసుకుని అనైతిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరిస్తే అక్రమ లైంగిక రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు పరోక్షంగా నేరాలు కూడా తగ్గే అవకాశాలున్నాయి.

ముంబయి.. దిల్లీ విమానాల్లో..
పంచతార హోటళ్లలో అనైతిక కార్యకలాపాలు వ్యవస్థీకృతంగా మారాయి. హిందీ, మరాఠీ, భోజ్‌పురి కథానాయికలు, ప్రయోక్తలను ఇక్కడికి నిర్వాహకులు రప్పిస్తున్నారు. ముంబయి… దిల్లీల నుంచి ఉదయాన్నే విమానాల్లో రావడం, పంచతార హోటళ్లలో బస చేయడం, రాత్రి విమానాల్లో వెళ్లిపోవడం… ఇలా నిత్యం అనైతిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాలం అందుబాటులోకి రావడం, విదేశీ తరహాలో స్పాలు.. మసాజ్‌ కేంద్రాలు ఏర్పాటు కావడంతో అనైతిక కార్యకలాపాలు రూపు మార్చుకున్నాయి. స్పాలలో విధులు నిర్వహించేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పించడం, వారు ఇక్కడికి వచ్చేముందే వారికి ఇక్కడ పనులు వివరించడంతో కొందరు యువతులు తిరస్కరిస్తుండగా… మరికొందరు అంగీకారంతోనే వస్తున్నారు. విదేశీ, స్వదేశీ యువతులతో మాట్లాడ్డం, వారి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌, దిల్లీ, కోల్‌కతాలో దళారీలు ఉన్నారు. వీరంతా సంకేత నామాల ద్వారా మాత్రమే మాట్లాడుకుంటూ వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్‌లలోని కొందరు పోలీస్‌ వేగుల ద్వారా సమాచారం వచ్చినప్పుడు మాత్రం పోలీస్‌ అధికారులు దాడులు చేస్తున్నారు. యువతులను రక్షిస్తున్నారు.

* బంజారాహిల్స్‌లోని ఓ పంచతార హోటల్‌లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి స్వయంగా సెక్స్‌ రాకెట్‌ను నిర్వహిస్తుండగా పంజాగుట్ట పోలీసులు కొద్దిరోజుల కిందట అతడిని అరెస్ట్‌ చేశారు. ముగ్గురు యువతులను రక్షించారు.

* మాదాపూర్‌లో రెయిన్‌ పేరుతో కొనసాగుతున్న స్పాలో సోదాలు నిర్వహించగా… ముగ్గురు విదేశీ యువతులు పట్టుబడ్డారు. బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు నిర్వహించగా… సెక్స్‌ రాకెట్‌లో రష్యన్‌ యువతిని గుర్తించారు.

ఉద్యోగాలు.. నకిలీ గుర్తింపుకార్డులు
అనైతిక కార్యకలాపాల నిమిత్తం దళారులు యువతులను ఇతర రాష్ట్రాలు, విదేశాలనుంచి విమానాలు, రైళ్ల ద్వారా రప్పిస్తున్నారు. హైదరాబాద్‌లో వారికి తాత్కాలికంగా ఉద్యోగాలిస్తున్నామంటూ నియామక పత్రాలు సృష్టిస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల పేర్లలో ఒకటి, రెండు అక్షరాలను మార్చి వారికి గుర్తింపు కార్డులను అందజేస్తున్నారు. పేర్లు ఒకటే ఉండటంతో విమానాశ్రయాల్లో, రైల్వే టీటీసీలు అనుమానించడం లేదు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత వారికి ప్రత్యేకంగా బస ఏర్పాటుచేసి పంచతార హోటళ్లు, లేదా అపార్ట్‌మెంట్లు, డూప్లెక్స్‌ గృహాలను తీసుకెళుతున్నారు. పంచతార హోటళ్లలో వెళ్లినప్పుడు విటులను కార్పొరేట్‌ సంస్థ అధికారులుగా, సెక్స్‌వర్కర్లను వారి సహాయకులుగా చూపిస్తున్నారు. కొన్ని పంచతార హోటళ్లలో కిందిస్థాయి ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకుని గదులు తీసుకుంటున్నారు. నెలలపాటు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇక అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లకు రెండునెలల అడ్వాన్స్‌ ఇవ్వడం, ఒకేసారి రెండు ఫ్లాట్లు తీసుకోవడంతో ఫ్లాట్ల యజమానులకు అనుమానం రావడంలేదు. ఇలాంటి వాటిపై పోలీసులు మరింత దృష్టి కేంద్రీకరిస్తే నేరాలు తగ్గిపోయే అవకాశాలున్నాయి.
prostitution in 5 star hotels