‘ఫిబ్రవరి 17న వైఎస్సార్‌సీపీ బీసీ డిక్లరేషన్‌’

‘ఫిబ్రవరి 17న వైఎస్సార్‌సీపీ బీసీ డిక్లరేషన్‌’

ఐదేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు నాయుడు చేసిందేమి లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో బీసీల జీవితాలు దుర్భర పరిస్థితిలో ఉన్నాయన్నారు. బీసీలకు న్యాయం చేయాలని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఏడాదిన్నర క్రితమే బీసీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. బీసీల పరిస్థితిపై కమిటీ అధ్యయనం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాలతో సమావేశమై నివేదిక రూపొందించామని తెలిపారు. ఫిబ్రవరి 17న ఏలూరులో జరిగే బీసీ గర్జనలో వైఎస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారని చెప్పారు.

బీసీలు ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదు : జంగా
ఐదేళ్లుగా బీసీలను గాలికొదిలేసిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోజయహో బీసీ అంటూ మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. చంద్రబాబు పాలనలో బీసీల జీవితాలు దుర్భర పరిస్థితికి వచ్చాయని ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో బీసీలకు చంద్రబాబు చేసిందేమి లేదన్నారు. చంద్రబాబు బీసీలపై చేసే వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. బీసీలు ఎవరూ చంద్రబాబుని నమ్మడం లేదన్నారు. వైఎస్‌ జగన్‌ మాత్రమే బీసీలకు న్యాయం చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రమంతా పర్యటించి సమస్యలను గుర్తించిదని, వాటి పరిష్కారం కొరకు వైఎస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారని తెలిపారు. బీసీ కులాలన్ని ఏకమై చంద్రబాబుకు బుద్ది చెప్పాలని కోరారు.