tdp prajavedhika

‘ప్రజావేదిక’ వద్ద టెన్షన్.. టెన్షన్.. భారీగా పోలీసులను మోహరించిన ప్రభుత్వం!

  • ప్రజావేదికను కూల్చేస్తామన్న సీఎం జగన్
  • చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ
  • ఆందోళన చేపట్టవచ్చన్న ఉద్దేశంతో భారీగా పోలీసుల మోహరింపు

ఆంధ్రప్రదేశ్ లో ‘ప్రజావేదిక’ కూల్చివేత వ్యవహారం అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య అగ్గి రాజేస్తోంది. నిబంధనలకు విరుద్దంగా, అవినీతితో నిర్మించిన ఈ భవనాన్ని కూల్చివేస్తామని సీఎం జగన్ ఈరోజు ప్రకటించడంతో టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. వీరితో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ప్రజావేదిక వద్ద భారీగా బలగాలను మోహరించారు.

చంద్రబాబు నివాసం, ప్రజావేదిక మధ్య బారికేడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు ఇంటి నుంచి నేరుగా ప్రజావేదిక వద్దకు వచ్చి ఆందోళన చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవేళ టీడీపీ నేతలు ఆందోళనకు దిగితే వారిని అరెస్ట్ చేసి తరలించేందుకు కూడా పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.