ప్రకంపనాలు సృష్టించిన పరకాల ప్రభాకర్ వ్యాసం

(ప్రసాద్ గోసాల)

దేశ ఆర్ధిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మాజీ ముఖ్యమంత్రి సలహాదారుడు, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
“నెహ్రు విధానాలు వ్యతిరేకించాలనే గుడ్డి ఆలోచన తోనే ప్రస్తుత ప్రభుత్వం ఉంది. దేశానికి ఒక దశ దిశ చూపి ఇప్పటికి ఎవరు సవాలు చేయలేని పి.వి.నరసింహారావు-మన్మోహన్ సింగ్ విధానాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా గతి లేని ఆర్ధిక విధానాన్ని అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వ విధానం దేశ ఆర్ధిక విధానాన్ని మరింత చిన్నాభిన్నం చేస్తోంది…” అన్నది క్లుప్తంగా పరకాల అభిప్రాయం. ఆర్ధిక మందగమనమే కాదు తిరుగమనంలోకి పరిస్థితి దిగజారుతున్నా బిజెపి నాయకులు వాస్తవాన్ని అంగీకరించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులలో పి.వి-మన్మోహన్ విధానాలే శిరోధార్యమని పరకాల ప్రభాకర్ గట్టిగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
పెద్ద నోట్ల రద్దు నుండి ఇప్పటి వరకు ఆర్థికంగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయన్నది చాల మంది నోట వినిపిస్తున్న మాట. అదే అంశాన్ని పరకాల మరింత శాస్త్రీయంగా విప్పి చెప్పడం బిజెపి శ్రేణులను కాస్త ఉక్కిరి బిక్కిరి చేసింది.
ఇక్కడ గమనించదగ్గ కీలక అంశం పరకాల ప్రభాకర్ కు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతరామన్ అర్థాంగి కావడం. పరకాల ప్రభాకర్ హిందూ దినపత్రికలో రాసిన వ్యాసంలో వెల్లడించిన అభిప్రాయాలపై విస్తృతంగా ప్రతిస్పందనలు వచ్చాయి. అవి ఆర్ధిక విధానాల చర్చ నుండి వారిద్దరి మధ్య సంబంధాల వరకు వెళ్ళిపోయాయి. ఆయన రాసిన వ్యాసం, వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇతర మాద్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఆయన చెప్పిన అభిప్రాయాలకు సానుకూలంగానే కాదు ప్రతికూల స్పందన కూడా వచ్చింది. ఇలాంటి అభిప్రాయలు ఎన్ని చెప్పినా బిజెపికి చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్టె అంటూ వ్యాఖ్యలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పనిచేసిన పరకాల మదిలో ఇటువంటి ఆలోచను కాకపోతే ఇంకేమి ఉంటాయని మరి కొన్ని అభిప్రాయాలు వెల్లడయ్యాయి. పరకాల ప్రభాకర్ జాతి వ్యతిరేక శక్తి అని కొందరంటే.. భార్య ఆర్ధిక మంత్రి అయినా గట్టిగా విమర్శలను గుప్పించి సంచలనం చేసారని మరికొందరు వ్యాఖ్యానించారు.
దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టమిట్టడుతున్నప్రస్తుత పరిస్థితిలో గట్టి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందని పరకాల తెలిపారు. ఈ గండం నుండి గట్టేకించి వ్యవస్థను ఒక దిశలో నడిపే మార్గదర్శనం కావాలని ఆయన కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించిన అభిప్రాయం పెద్ద చర్చనీయంశమే అయింది.