పులివెందులను నెంబర్ వన్ నియోజకవర్గం చేస్తా: ఏపీ సీఎం చంద్రబాబు

వైఎస్ కుటుంబానికి నలభై ఏళ్లుగా ఓటేస్తే ఏం చేశారు?
పులివెందుల అభివృద్ధి గురించి జగన్ ఎప్పుడైనా మాట్లాడారా?
పులివెందులను ఉద్యాన పంటల హబ్ గా మారుస్తా
రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా పులివెందులను తయారు చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన టీడీపీ రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, వైఎస్ కుటుంబానికి నలభై ఏళ్లుగా ఓటేస్తే ఏం చేశారు? పులివెందుల అభివృద్ధి గురించి జగన్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఈ నియోజకవర్గానికి నీళ్లు వచ్చేవి కాదని, ఇక్కడికి నీళ్లు తెప్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. కుప్పం నియోజకవర్గం కన్నా ముందే పులివెందులకు నీళ్లిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పులివెందులలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే బాధ్యత, ప్రతి రైతుకు గిట్టుబాటు ధర ఇప్పించే బాధ్యత తనదని చెప్పిన చంద్రబాబు, పులివెందులను ఉద్యాన పంటల హబ్ గా మారుస్తానని, ఇక్కడ శీతల గిడ్డంగులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.