విశాఖ నుంచి బరిలోకి దిగనున్న పవన్ కల్యాణ్?

పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలో కేసులు నమోదు

 పవన్ కళ్యాణ్‌ పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల భీమవరం సభలో పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తెలంగాణానా.. పాకిస్థానా? అని పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పవన్ రాజకీయ లబ్ధి పొందడం కోసమే తెలంగాణ సీఎం కేసీఆర్, ఇక్కడి ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. ఆంధ్ర ప్రజలను పవన్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని జేఏసీ నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగిన సమయంలోనూ ఇక్కడున్న ఆంధ్రులపై తెలంగాణ ప్రజలు దాడులు చేయలేదనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు.

ఏపీ చంద్రబాబు నాయుడి సూచనలతో పవన్‌ కళ్యాణ్ ఓట్ల కోసం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఎవరి భూములను లాక్కున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు సృష్టించి, తెలంగాణలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్న పవన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జేఏసీ అడ్వొకేట్లతోపాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా జూబ్లీహిల్స్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లలో పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేశారు.