పవన్ కల్యాణ్ అభిమానులే కాదు ఏపీ ప్రజలూ ఊహించి ఉండరు!: పరుచూరి గోపాలకృష్ఱ

పవన్ కల్యాణ్ అభిమానులే కాదు ఏపీ ప్రజలూ ఊహించి ఉండరు!: పరుచూరి గోపాలకృష్ఱ

తెలంగాణలో ఆమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున నందమూరి సుహాసిని పోటీ చేసి ఓటమిపాలైన విషయంపై ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అప్పట్లో తన విశ్లేషణ చేశారు. కాగా, ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓటమిపాలవడంపై తన విశ్లేషణ చెప్పడం లేదంటూ, తనకు సామాజిక మాధ్యమాల నేపథ్యంగా పలు పోస్ట్స్ వస్తున్నాయని పరుచూరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ‘పరుచూరి పలుకులు’లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో తెలియదు గానీ, పవన్ కల్యాణ్ పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, ఆయన ఓడిపోవడం మరో ఎత్తు అని గోపాలకృష్ణ అన్నారు. పవన్ కల్యాణ్ ఓటమి పాలవుతారని ఆయన అభిమానులే కాదు ఏపీ ప్రజలు కూడా ఊహించి ఉండరని అన్నారు. పవన్ అసెంబ్లీలో అడుగుపెడతాడనే తానూ భావించానని చెప్పారు. ప్రశ్నించే హక్కు గురించి అనుక్షణం మాట్లాడుతున్న పవన్ ని ప్రజలు గెలిపించకపోవడం నమ్మశక్యం కాని నిజం అని వ్యాఖ్యానించారు. పవన్ కోరుకున్న ‘మార్పు’ ఇంకా రాలేదని, ఆ ‘మార్పు’ను ఆయన తీసుకొస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.