‘పవనిజం’ అంటే ‘నిజం’.. ఆ నిజానికి ప్రత్యక్షరూపం పవన్ కల్యాణ్!: నాగబాబు

2008, 2009 నుంచి ‘పవనిజం’ ఉంది
ఈ మాట ఎందుకొచ్చిందో కల్యాణ్ బాబుకూ తెలియదు
నాక్కూడా మొదట్లో తెలిసేది కాదు
జనసేన పార్టీ అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ ను అభిమానించే అభిమానుల నోటి నుంచి తరచుగా వినబడుతుండే మాట ‘పవనిజం’. అసలు, ‘పవనిజం’ అంటే ఏమిటనే ప్రశ్నకు పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘‘పవనిజం’ అనేది పార్టీ పెట్టకముందు నుంచి.. 2008, 2009 నుంచి ఉంది. ఈ ‘పవనిజం’ అనే మాట ఎందుకొచ్చిందో కల్యాణ్ బాబుకు కూడా తెలియదు. నాక్కూడా మొదట్లో తెలిసేది కాదు.

అసలు ‘పవనిజం’ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. కానీ, ‘పవనిజం’ అని ఎవరైతే అంటున్నారో వాళ్లకు మాత్రం తెలుసు పవనిజమంటే. ‘పవనిజం’ అంటే ట్రూత్. నిజాన్ని మనం తట్టుకోలేం. నిజాయతీ, నిజం ఉన్నవాడిని మనం ఎదుర్కోలేం.. చాలా కష్టం. మన ముందు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ పర్సన్ ఉంటే.. అతను మనకు గిల్ట్ క్రియేట్ చేస్తుంటాడు. ఎందుకంటే, మనం అలా ఉండలేము కాబట్టి. కల్యాణ్ బాబు అలాంటి వాడు.. నిజాయతీపరుడు, నిజం. ‘నిజం’ అనేది ‘ఫైర్’ లాంటిది. దానిని భరించలేం. ఇంతకాలంగా నేను చేసిన ఎనలైజేషన్ లో ‘పవనిజం’ అంటే ‘నిజం’ అని తెలిసింది. ‘నిజం’ అనే దానికి ‘పవనిజం’ అనేది ప్రత్యామ్నాయ పదం. ఆ ప్రత్యామ్నాయ పదానికి ప్రత్యక్షరూపం పవన్ కల్యాణ్.