పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు.. ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్‌

ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలింగ్‌లో ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా చాలా కోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. పలుచోట్ల ఉదయం 9 గంటల వరకు కూడా పోలింగ్‌ ప్రారంభం కాలేదు. పోలింగ్‌ కేంద్రాల్లో వెలుతురు సరిగా లేకపోవండంతో ఎవరికి ఓటు వేస్తున్నామో తెలియకుండా ఉందని పలుచోట్ల ఓటర్లు ఫిర్యాదు చేశారు.తమ ఓట్లు గల్లంతయ్యాయని కొన్నిచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగారు. జాబితాలో ఏజెంట్లు, అధికారుల పేర్లు లేకపోవడం పలుచోట్ల గందరోళ పరిస్థితులు తలెత్తాయి. సాంకేతిక సమస్యలతో గంటల తరబడి వరుసలో నిలబడిరావడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 220 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించినట్టు ప్రాథమిక సమాచారం.
► మెదక్ జిల్లా రెగోడ్ మండలంలోని జగిరీయల్ గ్రామంలో 20 పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరయించడంతో పోలింగ్ ఆగిపోయింది.
► పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శాంతినగర్ ప్రజా పాఠశాలలో ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
► నిజామాబాద్‌ డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో 104, 105, 106 పోలింగ్ కేంద్రాల్లో 20 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
►నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో, పాలిటెక్నిక్ కళాశాల పోలింగ్ కేంద్రాల్లో గంట ఆలస్యంగా జరుగుతున్న పోలింగ్
► సిద్దిపేట నియోజకవర్గం పోలింగ్ స్టేషన్‌లో కనపడని మహాకూటమి, బీజేపీ పోలింగ్ ఏజెంట్లు
►కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండలంలోని తలోడి గ్రామంలో 154 బూత్ సిబ్బందికి అవగాహన లేక ఉదయం తొమ్మిది గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. ఆసిఫాబాద్ మండలం ఎల్లరం, బెజ్జూరు మండల కేంద్రంలోని 188 పోలింగ్‌ కేంద్రం, మొర్లీగుడలో ఈవీఎంలు మొరకాయించడంతో 9 గంట వరకు పోలింగ్‌ ప్రారంభం కాలేదు.
► భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలో నిజాంపేట, కంబాలపల్లి, లచ్చగూడెం, సత్యనారాయణపురం ఇంకా పలు చోట్ల ఈవీఎంలు మొరాయింపు
► జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని పలు పోలింగ్ సెంటర్లలో విద్యుత్ సరిగా లేక ఇబ్బంది పడుతున్నఓటర్లు
► రాజన్న సిరిసిల్ల కొనారావుపేట్ మండలం నాగారంలో మొరాయిస్తున్న ఈవీఎం
► జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నందగిరిలో మొరాయించిన ఈవీఎం
► కొమురంభీం జిల్లా తిర్యాణి మండల కేంద్రంలోని 131వ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో గంట అలస్యంగా పోలింగ్ మొదలైంది. పోలింగ్‌ సమయాన్ని గంట పొడిగించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
►చంద్రాయణ గుట్ట, కుత్భుల్లాపూర్‌లో ఓట్లలో అవకతవకలు జరిగాయయని ఓటర్లు ఆందోళన చేపట్టారు. ఎలక్షన్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు ఓటరు స్లిప్పులు, ఐడీ కార్డులు అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.