పప్పులో కాలేసిన లగడపాటి రాజగోపాల్ సర్వే

పప్పులో కాలేసిన లగడపాటి రాజగోపాల్ సర్వే

ఇంత భారీ విజయాన్ని ఊహించని జాతీయ మీడియా
పప్పులో కాలేసిన లగడపాటి రాజగోపాల్
90 స్థానాల్లో టీఆర్ఎస్ మెజారిటీ

ఎగ్జిట్ పోల్స్ విషయంలో తెలంగాణ ప్రజల నాడిని జాతీయ మీడియా సరిగ్గా అంచనా వేయలేకపోయింది. టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అత్యధిక చానళ్లు అంచనా వేసినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో ఘన విజయం సాధిస్తుందని ఏ చానల్ కూడా స్పష్టంగా చెప్పలేకపోయింది. ఇక ఆంధ్రా అక్టోపస్ గా పేరు తెచ్చుకున్న లగడపాటి రాజగోపాల్, ప్రజా కూటమి గెలుస్తుందని చెప్పి, పప్పులో కాలేశారు. మేజిక్ ఫిగర్ ను దాటి మరిన్ని స్థానాల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమవుతుందని తెలుస్తోంది.

టీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ లు తమకు 100 స్థానాల్లో విజయం ఖాయమని ఘంటాపథంగా చెప్పగా, ఆ స్థాయిలో కాకపోయినా, దానికి దగ్గరగా, దాదాపు 90 స్థానాల్లో టీఆర్ఎస్ విజయానికి చేరువైంది. ఇక లగడపాటి టీఆర్ఎస్ కు 35 సీట్లు, ప్రజా కూటమికి 65 సీట్లు (పది సీట్లు అటూఇటుగా), బీజేపీకి 7, ఇతరులకు 14 (ఎంఐఎంతో కలిపి) వస్తాయని వేసిన అంచనాలు వాస్తవ గణాంకాలకు మైళ్ల దూరంలో నిలిచాయి. ఇదే సమయంలో జాతీయ మీడియా సంస్థలు సైతం టీఆర్ఎస్ 70కి మించి అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేయలేకపోయాయి.

ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల ట్రెండ్స్ వచ్చేయగా, టీఆర్ఎస్ 90, కాంగ్రెస్ 15, బీజేపీ 4, ఎంఐఎం 5, ఇతరులు 2 చోట్ల ముందంజలో ఉన్నారు.