నేడు చరిత్రగల తెలంగాణ హైకోర్టు శతాబ్ది ఉత్సవాలు

ఘన చరిత్రగల తెలంగాణ హైకోర్టు భవనం శతాబ్ది ఉత్సవాలు శనివారం నిర్వహించేందుకు ముస్తాబైయింది.  హైకోర్టు శతాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు  చేశారు. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌రెడ్డి హాజరు కానున్నారు.  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ స్వయంగా.. వంద ఏళ్ల ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మూసీ నది ఒడ్డున 1920 ఏప్రిల్ 20 న.. 7వ నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌  హైకోర్టు భవనాన్ని ప్రారంభించారు. 1915 లో హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. 1920 ఏప్రిల్‌ 20 నాటికి పూర్తైంది. జైపూర్‌కు చెందిన ఇంజనీర్, ఆర్కిటెక్ట్‌ శంకర్‌లాల్‌ హైకోర్టు నమూనా ను తయారు చేశారు.  హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్‌ మెహర్‌ అలీ ఫజల్‌ నిర్వహణ బాధ్యతలను చేపట్టారు. 18.22 లక్షల అంచనా వ్యయంతో హైకోర్టు భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవరతన్‌ దాస్‌ దక్కించుకున్నారు. ఇండో-ఇస్లామిక్‌ సంప్రదాయ రీతిలో హైకోర్టు భవనాన్ని నిర్మించారు. మొత్తం ఆరుగురు జడ్జీలు, న్యాయవాదుల సంఘం పని చేసేలా భవన నిర్మాణం జరిగింది.

నిజాం కాలంలో రాయల్ చార్టర్ కింద కొనసాగిన న్యాయస్థానంలో 1928 లో హైకోర్టు యాక్ట్ కింద బెంచ్ లు ఏర్పాటు చేసి కేసుల విచారణ చేపట్టారు. స్వాత్రంత్య అనంతరం హైదరాబాద్ విలీనం తర్వాత.. హైకోర్టు ఆఫ్  హైదరాబాద్ పేరుతో కొనసాగింది. తదనంతరం ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత.. ఏపీ హైకోర్టుగా నామకరణం చేశారు. 1956 నవంబర్ 5న 11 మంది జడ్జీలతో ఏపీ హైకోర్టు ప్రాంభమైంది. ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ కోకా సుబ్బారావు పని చేశారు. ఇక 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్  హైకోర్టును.. రెండు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టుగా మార్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు 2019 జనవరి 1న ప్రత్యేక  హైకోర్టులు ఏర్పాటు కావడంతో ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారు. హైకోర్టు విభజన అనంతరం.. ప్రస్తుతం ఇదే భవంనలో తెలంగాణ  హైకోర్టు కొనసాగుతుంది.

ఎంతో ఘనచరిత్ర కలిగిన తెలంగాణ హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తి కావడం పట్ల తెలంగాణ న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కిన మరో అరుదైన గౌరవం.. శతాబ్ది ఉత్సవాలన్నరు. ఈ నెల 20న హైకోర్టులో జరిగే శతాబ్ది సంబరాలకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ న్యాయవాదులు,  బార్ అసోసియేషన్ సభ్యులు,  బార్ కౌన్సిల్ ప్రతినిధులు అందరూ హాజరవుతారని చెప్పారు.

హైకోర్టు భవనంలో కార్యకలాపాలు ప్రారంభమై.. వంద ఏళ్లు పూర్తైనా.. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడంపై న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవనంను నిర్మించిన కళాకారులదే ఆ ఘనత అంటున్నారు. స్వరాష్ట్రంలో హైకోర్టు శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Leave a Reply