‘నీటిరంగుల చిత్రం.’

ఒక్కోమారు అద్భుతాలు ఆలస్యంగా తెలుస్తాయి లేదా మనల్ని తాకుతాయి.అలా నన్ను చేరిన పోనీ నేను చేరుకున్న అద్భుతం ‘నీటి రంగుల చిత్రం’ . చిత్రకారుడైన కవి  శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు లిఖించిన అక్షర చిత్రం ఈ కవితా సంకలనం.
 మొత్తం 182 కవితలు. కవితలు కొంచెం సుదీర్ఘం అయితే చదువుతూ ఉంటే అప్పుడే కవిత అయిపోయిందా అనిపిస్తుంది. ఈ మధ్యకాలములో నేను చదివిన కవిత్వంలో ఏ కవితలతో పోల్చలేని ఒక అసాధారణ శైలి,నడక . కవిత చదువుతుంటే దృశ్యం ఆవిష్కృతం .
పాలుగారే ప్రపంచం కవితలో’ ఏ జర్మన్ ,జపాన్ కవితలోనో ఆ పదం’
‘నాన్న ఒంటి చెమట, మీ అమ్మ మజ్జిగ చిలికేటప్పటి వెన్నవాసన.’
మట్టి,చెమట, శ్రమ సౌందర్యం తెలిసిన కవిత.
కొంతసేపు నన్ను ఆపేసిన కవిత ‘కవిత రాయటమంటే, ఆకాశాన్నీ ,భూమినీ ధ్యానించడం.
‘ఎండిపోతున్నట్టే వుందిగానీ,అడవిలో
ఒక రహాస్యోద్యమం మొదలైనట్టేవుంది.’ పరిశీలన , ఒక ఆశావహదృక్పధంతో  ప్రకృతిని అర్ధం చేసుకోవడం కవి నేత్రం ఇక్కడ హరితభరితం.
మట్టికి కాంతికీ మధ్య సంవాదం, మిగిలిన సుగంధం ఒక మొలక ఈ కవితల పేరే చాలు అన్నట్లుగా ఉన్నాయి.
‘ఒక కవిత కూర్చటానికి’ ఈ కవిత   శ్రమ పట్ల కవికి  గల స్పృహను , శ్రమను సౌందర్యంగా చూపించే చిత్రకారుని ఒడుపును చూపే కవిత.
ఒకటి కాదు రెండు కాదు కవితలన్నీ నీటి రంగుల సజీవ చిత్రాలు ఎంతో శ్రద్ధతో మలిచిన తొలిచిన శిల్పాలు.కళ్లెదుట ఆవిష్కృతం అయ్యే జీవన నాట్యాలు.
రాలిన ఒక నెమలీక,
మళ్ళా ఒకదీపం పట్టుకుని,
మళ్ళా ఆ దారిన అడుగుపెట్టాం,
గోధూళి వేళ
ఈ కవితలన్నీ పొంగి పొరలుతున్న కొండవాగు అంత ఉధృతంగా మదిలోకి చొచ్చుకు పోతాయి.అలజడి పెడతాయి.
రహస్య చిత్రలిపి,
చిగురించిన రంగులు,
పిట్టలు విసిరిన వల
ఈ కవితలు చదివేటప్పుడు కవి,మనం ఇద్దరూ అదృశ్యం అయిపోయి కవితలో దృశ్యం మాత్రమే పిట్టలు,కొండలు,జీడీమామిళ్ళు ఉండి పోతాయి.
గూగుల్ ఎర్త్ లో కనపడని దేశం,
అలంకారంగా మారిన అమ్ములపొది
కవితలు  కోల్పోయిన ఆకుపచ్చ వైభవాన్ని గుర్తుచేసి గుండె బరువెక్కిస్తాయి.
ప్రకృతిని ,జీవితాన్ని అతి దగ్గరగా సునిశితంగా చూపే విలక్షణ కవిత్వం.తాత్వికత కన్నా జీవనవిధానాన్ని, జీవిత సత్యాలని సౌందర్యంతో కూడిన సరళతతో చూపిన వైనం.
కవితా వైభవం అంటే అర్ధమైన ఈ క్షణం ఈ నీటిరంగుల చిత్రం సాక్షిగా నాకు నేను రాసే కవితల్ని వదిలేసి అస్త్ర సన్యాసం చెయ్యాలనిపించింది.
నిజమే గొప్ప  కవి మాట్లాడడు నిశ్శబ్ద చిత్రాలని  చిత్రించి  ప్రపంచానికి ఇస్తాడు. అతని కవితలు చెపుతాయి అతని హృదయమేమిటో . వాడ్రేవు చిన వీరభద్రుడు గారు అటువంటి కవి . తప్పక చదవవలసిన  కాదు కాదు దగ్గర ఉంచుకుని  మళ్లీ మళ్లీ చదవ వలసిన పుస్తకం ‘నీటిరంగుల చిత్రం.’
వసుధారాణి.