నిమ్మగడ్డ పై జగన్ కులపరమైన ఆరోపణలు

అమరావతి:

‘స్థానిక’ ఎన్నికల‌ను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల‌ కమీషనర్‌ ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’పై అధికార వైకాపా విరుచుకుపడుతోంది. ఎవరికీ చెప్పాపెట్టకుండా ఎన్నికల‌ను వాయిదా వేశారని, ప్రతిపక్షనేత ఆడించినట్లు ఆయన ఆడుతున్నారని వైకాపా మీడియాతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. వైకాపాకు చెందిన మీడియా ఇప్పటికే ఆయనపై కుల‌ ముద్ర వేసేసింది. ఆయన ‘చంద్రబాబు’ సామాజికవర్గానికి చెందిన వారని, అందుకే స్థానిక ఎన్నికల‌ను వాయిదా వేశారని విమర్శిస్తోంది. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం దీనిపై ప్రచారాన్ని ప్రారంభించగా, రాష్ట్ర సమాచారశాఖ మంత్రి ‘పేర్నినాని’ మరో అడుగు ముందుకేసి ఎన్నికల‌ కమీషన్‌కు ‘కరోనా’ వైరస్‌ సోకిందని, ‘చంద్రబాబు’ బంధువైనందునే ఎన్నికల‌ కమీషనర్‌ ఎన్నికల‌ను వాయిదా వేశారని ఆరోపించారు.  ‘నిమ్మగడ్డ’ చంద్రబాబు మనిషి అని, ఆయన ‘చంద్రబాబు’కు అనుకూలంగా వ్యవహరిస్తారని, తాము ముందే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌కు చెప్పామని, కానీ..ఐఎఎస్‌ అధికారులు అలా వ్యవహరించిన ‘జగన్‌’ అన్నారని, కానీ ఎన్నికల‌ కమీషనర్‌ ఆ నమ్మకాన్ని నిల‌బెట్టుకోలేదని ఆయన ధ్వజమెత్తారు.  రాష్ట్రాన్ని అస్థిరపరచాల‌నే కుట్రలో భాగంగా ఇలా చేస్తున్నారని, కుట్రపూరితంగా ఎన్నికల‌ను వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. కాగా వైకాపాకు చెందిన సోషల్‌మీడియా విభాగం ఇప్పటికే ‘రమేష్‌కుమార్‌’ కులం గురించి చెబుతూ విమర్శులు చేస్తోంది. మొత్తం మీద..నిన్నటి దాకా ఎన్నికల‌ కమీషనర్‌ ‘రమేష్‌కుమార్‌’ బ్రహ్మాండంగా పనిచేశారన్న వైకాపా నేతలు…‘కరోనా’తో ఎన్నికలు వాయిదా వేయగానే ఆయనపై కుల‌ విమర్శల‌కు దిగడం గమనార్హం.