నిన్న వాకింగ్ కు వెళ్లి అదృశ్యమైన వైష్ణవి… నేడు విగతజీవిగా!

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బాలాపూర్ మండలం అల్మాస్ గూడలో నిన్న అదృశ్యమైన వైష్ణవి మృతదేహాన్ని పోలీసులు నేడు కనుగొన్నారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు భావిస్తున్నారు. ఈ ఉదయం రాజీవ్ గృహకల్పలోని చర్చ్ దగ్గర ఓ బాలిక మృతదేహం కనిపించడంతో, ఆమె అదృశ్యమైన వైష్ణవేనని గుర్తించిన తల్లిదండ్రులు, కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్న వాకింగ్ కు వెళ్లొస్తానని చెప్పిన వైష్ణవి ఎంతకూ తిరిగి రాకపోవడంతో మీర్ పేట పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం గాలిస్తున్నామని, ఆమె వాకింగ్ చేసిన దారిలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు.