నిధులను టీడీపీ ఫండ్ లోకి మళ్లిస్తున్నారనే అనుమానం ఉంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

తాత్కాలిక నిర్మాణాలకే పరిమితమవుతున్నారు
ఏపీ అభివృద్ధిలో లాస్ట్.. అనివీతిలో నెంబర్ వన్
ఏపీ ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా నిఘా ఉంటుంది
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిధులను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక నిర్మాణాలకే పరిమితమవుతున్నారని, అలా మిగిలిన నిధులను పార్టీ ఫండ్ లోకి మళ్లిస్తున్నారనే అనుమానం తమకు ఉందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం చేసే ప్రతి పని పైనా జాతీయ స్థాయిలో నిఘా ఉంటుందని హెచ్చరించారు.

‘ఏపీ అభివృద్ధిలో లాస్ట్.. అనివీతిలో నెంబర్ వన్’ అని, టీడీపీ ప్రభుత్వానికి విలాసాలపై ఉన్న ధ్యాస వికాసంపై లేదని, ధర్మపోరాటం పేరిట దొంగపోరాటం చేస్తోందని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కార్పొరేట్ సంస్థల అధిపతి మంత్రిగా ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసని విమర్శించారు.

రాష్ట్రం అభివృద్ధి కోసం రుణాలు తీసుకోవడం తప్పుకాదని, ఏపీలో మాత్రం ఆ విధంగా జరగట్లేదని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రుణాలను తీసుకోవడమే పెద్ద కుంభకోణమని, అందుకే, లెక్కలు చెప్పేందుకు భయపడుతున్నారని, రాజధాని అమరావతిలో వెయ్యి రూపాయలు ఖర్చయ్యే చోట పదివేలు ఖర్చు చేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు.