నా కలల్ని నెరవేర్చుకోవాలనే…

‘‘పారితోషికం కంటే నటన గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటా’’ అంటోంది కీర్తిసురేష్‌. ఇప్పటికే బంగారం లాంటి భామ అనిపించుకొందామె. ‘మహానటి’తో ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన కీర్తి, ప్రస్తుతం తమిళంలో పక్కా మాస్‌ చిత్రాల్లో నటిస్తోంది. అందులో ‘పందెం కోడి 2’ ఒకటి. ఆ చిత్రం కోసం తనతో కలిసి పనిచేసిన చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ ఒకొక్క బంగారు నాణేన్ని అందజేసి తన పెద్ద మనసుని చాటుకొంది. ఆమెకి ఈ అలవాటు మొదట్నుంచీ ఉందట. ఇదివరకు వెండినాణేలు ఇచ్చేవారట. ‘మహానటి’ నుంచి బంగారు నాణేలు ఇస్తోంది. డబ్బు విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయని అడిగితే… ‘‘డబ్బు సంపాదించాలనైతే నేను సినిమా రంగంలోకి రాలేదు. సినిమాపై నాకున్న తపన, నేను కన్న కలల్ని నెరవేర్చుకోవడమే లక్ష్యంగా ఇటువైపు వచ్చా. సినిమా రంగంలో మన పనితీరే మన పారితోషికాన్ని నిర్ణయిస్తుందని నమ్ముతా. అందుకే కథలు, పాత్రలు, అభినయం గురించి ఆలోచించినంతగా వేరే ఏ విషయాన్నీ పట్టించుకోను’’ అని చెబుతోంది కీర్తి. ప్రతి సినిమా చేస్తున్నప్పుడు, ఆ బృందంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుందని చెప్పింది కీర్తి.