నరసరావుపేట లోక్‌సభ బరిలో ఉద్దండులు.. ఈసారి గెలుపు ఎవరిది?

నరసరావుపేట లోక్‌సభ బరిలో ఉద్దండులు.. ఈసారి గెలుపు ఎవరిది?

దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో నరసరావుపేట కూడా ఒకటి. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి కేంద్ర హోం మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా,అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ నియోజకవర్గానికి ఎంతో గుర్తింపు తెచ్చారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి పోటీచేసిన నేదురుమల్లి.జనార్దన్ రెడ్డి, కొణిజేటి రోశయ్య ఆతర్వాత కాలంలో ముఖ్యమంత్రులుగా సేవలందించారు.ఇటువంటి నియోజవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా రాజకీయంగా,సామాజికవర్గ పరంగా,ఆర్ధికంగా అత్యంత బలవంతులు కావడంతో రాష్ట్రరాజకీయాల దృష్టి ఒక్కసారిగా నరసరావుపేట వైపు మళ్ళింది.

నరసరావుపేట పార్లమెంటు బరిలో నిలిచిన మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు రాజకీయంగా ఉద్దండులు కావడం నరసరావుపేట పార్లమెంటు ఎన్నికలపై ఆసక్తి రేపుతోంది.అటు తెలుగు దేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ రాయపాటి.సాంబశివ రావు మరోసారి టికెట్ తెచ్చుకుని బరిలో నిలవగా, ప్రతిపక్ష వైసీపీ నుంచి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డా.లావు రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు బరిలో దిగారు.మరోవైపు కేంద్రంలో అధికార బీజేపీ నుంచి ఓటమెరుగని ధీరుడిగా పేరుగాంచిన కన్నా.లక్ష్మీనారాయణ బరిలో దిగాడు.ఈ పరిణామాలను గమనిస్తే నరసరావుపేట పార్లమెంటు బరిలో త్రిముఖ పోరు తప్పేలా లేదు.

ఇక ప్రతిపక్ష వైసీపీ నుంచి బరిలో నిలిచిన లావు.శ్రీకృష్ణదేవరాయలు యువకుడు, విద్యావంతుడు కావడం, అంతేకాకుండా ఆయన నియోజక వర్గంలోని ప్రధాన సామాజిక వర్గాలలో ఒకటైన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం అతనికి కలిసొచ్చే అంశాలు.పైగా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు గాంచిన విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య కుమారుడు కావడం ఆయన ప్రధాన బలం. లావు రత్తయ్యకు తెలుగుదేశం పార్టీతో పాటు ఆయన సొంత సామాజిక వర్గంలో నేతలతో వ్యక్తిగత పరిచయాలు మెండు.సార్వత్రిక ఎన్నికలకు ఎంతో ముందుగానే అభ్యర్థిత్వం ఖరారవ్వడంతో నియోజకవర్గం మొత్తం రెండు మూడుసార్లు చుట్టిరావడం శ్రీక్రిష్ణ దేవరాయలుకు కలిసొచ్చే అంశం.దానికి తోడు అధికార పార్టీ వ్యతిరేకత, గతంలో గెలిచిన రాయపాటి నియోజవర్గానికి అందుబాటులో ఉండక పోవడం, ప్రతిపక్ష వైసీపీకి అనుకూల పవనాలు, శ్రీకృష్ణదేవరాయలుకి ఉన్న ఆర్థిక, అంగబలం కారణంగా అతనికి విజయావకాశాలను మెండుగా కనిపిస్తున్నాయి.

ఇకపోతే జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ తరఫున కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు,మాజీ మంత్రి,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా.లక్ష్మీనారాయణ బరిలో నిలవడంతో నరసరావుపేట పార్లమెంటు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.కన్నా ప్రభావం రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం పైన ఎంతో కొంత ప్రభావం చూపిస్తుందనేది కాదనలేని సత్యం.కాపు సామాజిక వర్గం తన వెంట నడిస్తే ఆ ప్రభావం ఎవరిపై పడుతుందో తెలియని పరిస్థితి. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయపరంగా, సామాజిక వర్గం పరంగా ,ఆర్థికపరంగా అత్యంత బలవంతుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం అనే చెప్పాలి.

ఇక్కడ జనసేన ప్రభావం నామ మాత్రంగా ఉండడంతో కాపు సామాజిక వర్గం ఓట్లపై కన్నా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ పట్ల ఆంధ్ర ప్రజల్లో ఉన్న ద్వేషం కన్నాకు కంటి మీద కునుకులేకుండా చేస్తుంది.ఇకపోతే అటు కాంగ్రెస్ పార్టీ ఇటు జనసేన పార్టీలు రెండూ కూడా నరసరావుపేట నియోజకవర్గంలో పెద్దగా ప్రభావం చూపలేవనే చెప్పాలి. అభ్యర్థులు కూడా ఏమంత బలమైన వారు కాదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రాజకీయ చైతన్యం కలిగిన నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని గెలిపిస్తారు ఎవరిని ఓడిస్తారో మరో 20 రోజులు అయితే గాని తెలియదు…!!