tholi yekadhasi festival story

తొలి ఏకాదశి

హైందవ సంప్రదాయ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఏకాదశి అత్యంత పుణ్యవంతమైన తిథి. సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’గా భావిస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక దీన్ని హరి వాసరమని పిలుస్తారు. క్షీరాబ్దిలో శేషపర్యంకం మీద శ్రీమహా విష్ణువు ఈ పర్వదినాన శయనిస్తాడు కనుక ‘శయనైకాదశి’ అనీ ఈ పండుగకు పేరుంది. ఈ రోజునుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు గోచరిస్తాడు. నేటి నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు.

తొలి ఏకాదశి పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ చేస్తారు. ఈ వ్రతానికి సంబంధించి ఓ పురాణగాథ ఉంది. యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని యమధర్మరాజును కోరారు. ‘గోపద్మ’ వ్రతం ఆచరించనివారి భార్యల నుంచి ఆ చర్మం తీసుకురావలసిందని భటులను పంపించాడు యముడు. నారదుడి ద్వారా ఈ సంగతి తెలుసుకున్న శ్రీకృష్ణుడు ద్వారకలోని స్త్రీలందరిచేత ఈ వ్రతం చేయించాడన్నది పురాణ కథనం.

కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరం వల్ల గర్వితుడై దేవతలు, రుషులను హింసిస్తుంటే శ్రీహరి అతడితో వెయ్యేళ్లు పోరాడి, ఓ గుహలో విశ్రాంతి తీసుకొంటుండగా, ఆయన దేహం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ అసురుణ్ని సంహరించిందని చెబుతారు. సంతోషించిన విష్ణు భగవానుడు ఆ కన్యకు వరం ప్రసాదిస్తే- ‘ఏకాదశి’ తిథిగా, విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంటుంది. అప్పటి నుంచి ‘తొలి ఏకాదశి’ వ్యవహారంలోకి వచ్చిందని పురాణ కథనం.

అంబరీష మహారాజు దుర్వాస మహర్షి శాపం నుంచి తప్పించుకుని హరిభక్తి తత్పరతతో ఏకాదశి వ్రతం చేయడంవల్ల విష్ణుసాయుజ్యం పొందినట్లు పురాణగాథ చెబుతోంది. బ్రహ్మహత్యాది పాతకాలన్నింటినీ తొలగించి, భక్తుడికి ముక్తిని ప్రసాదించే మహత్తర వ్రతమిది. ఈ వ్రతం ఆచరించే గృహంవైపు యముడు కూడా కన్నెత్తి చూడలేడట.

ఆషాఢ మాసాన తొలకరి జల్లులతో నేలతల్లి పులకరిస్తుంది. అన్నదాతల లోగిళ్లలో కోటి ఆశల కాంతులు నింపుతుంది. బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలూ చేస్తారు. ప్రసన్నత, ప్రశాంతత, స్వాతిక చింతన, జ్ఞానపిపాసకు తొలి ఏకాదశి అవకాశాలు కల్పిస్తుంది.

చాతుర్మాస్యం అంటే నాలుగు నెలల సమయం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ఈ చాతుర్మాస్య వ్రతాన్ని అవధూతలు, యతులు, యోగులు ఆచరిస్తారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రియమైంది ఈ తొలి ఏకాదశి. వర్ష రుతువునుంచి శరదృతువు వరకు నాలుగు నెలలపాటు శ్రీహరి శేషశయనం మీద పవళించి యోగ నిద్రలో నుంచి ఉత్థాన ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ సమయంలో స్వామి పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి తిరిగివస్తాడని పురాణగాథ ఉంది.

చాతుర్మాస్య వ్రతం పీఠాధిపతులు, సాధువులు, మహర్షుల వరకే కాదు, మహిళలూ సభక్తికంగా ఆచరిస్తారని భీష్మపితామహుడు ప్రవచించాడు. చాతుర్మాస్య వ్రతారంభంలో సాధువులు, తాపసులు లోకసంచారం చేయకుండా తమ ఆశ్రమంలో కాని, గృహస్థుల ఇళ్లలో కాని ఉంటారు. క్రిమికీటకాలను హింసించరాదన్న భావంతో వంటల్ని నిలిపేసి, ఉపవాసాలకు ప్రాధాన్యమిస్తారు. ఇదేకాలంలో వ్యాసపూర్ణిమ గురు పౌర్ణమిగా సమాదరణ పొందుతోంది.
ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలోపండగలు ఎక్కువ. ఆరోగ్య పరిరక్షణార్థం నియమాలు ఎక్కువగా పాటించాలి. అందువల్ల పెద్దలు వ్రతాలు, ఉత్సవాలు ఎక్కువగా పెట్టారు. వ్రత సమయంలో పిప్పల వృక్షానికి ప్రదక్షిణ, దేవాలయాల్లో దీపారాధన చేస్తారు. సరస్వతీదేవిని పూజిస్తారు. భూశయనమే చేస్తూ అతిథులు భుజించిన తరవాతే ఆహారం తీసుకుంటారు.

ఆషాఢ మాసంలోనే బౌద్ధులూ చాతుర్మాస్య వ్రతం ఆరంభిస్తారు. జైనులు ‘స్నానోత్సవం’గా ఆచరిస్తారు. వరాహ, పద్మ, స్కాంద పురాణాల్లో, ‘నిర్ణయసింధు’లో చాతుర్మాస్యం గురించి విశేషమైన వర్ణన గోచరిస్తుంది. శివారాధన కూడా చాతుర్మాస్యంలో జరుగుతుంది.
tholi yekadhasi festival story