తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వానలు… ప్రజల అవస్థలు!

  • అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వానలు
  • పలు ప్రాంతాల్లో నీటమునిగిన పంట పొలాలు
  • ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నది

అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వానలు పడుతుండగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోస్తాంధ్ర తడిసి ముద్దవుతోంది. వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలోనే నానుతున్నాయి. కృష్ణా జిల్లాలో భారీ వర్షపాతం ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు 800 ఎకరాల వరి, మినుము, పెసర పంట నీటమునిగింది. ఉభయ గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ విస్తారంగా వర్గాలు కురిశాయి. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదుకాగా, అనంతపురం జిల్లాలో చెప్పుకోతగ్గ వర్షాలు పడలేదు.

ఇక తెలంగాణ విషయానికి వస్తే, గత మూడు రోజులుగా రాష్ట్రమంతా వర్షాలు ఆగి ఆగి కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదికి అనుసంధానంగా ఉన్న ఉన్న చిన్నా, పెద్ద రిజర్వాయర్లన్నీ నిండుకుండలయ్యాయి. కిన్నెరసాని వంటి ఉప నదులు ఉగ్రరూపం దాల్చాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఈ సీజన్ లో గరిష్ఠంగా 39 అడుగులను దాటింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.