home page

అదాన్ డిస్టలరీస్ ఎవరిదో?

బేవరెజెస్ కార్పొరేషన్ జవాబు చెప్పాలి

 | 
Raghu

అదాన్ డిస్టలరీ ఎవరిదీ?

శివకుమార్ ఎవరు??

 అదాన్ వద్ద నుంచి ఏ ప్రాతిపదికన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోలు చేస్తోంది???

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

అదాన్ డిస్టలరీ  ఎవరిదని?, బొలారం శివకుమార్ ఎవరని??, ఏ ప్రాతిపదికన ఏపీ  బేవరేజెస్ కార్పొరేషన్ , అదాన్ డిస్టలరీ  వద్ద నుంచి మద్యాన్ని కొనుగోలు చేస్తుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. అదాన్ డిస్టలరీ  ఉత్పత్తి చేస్తున్న మద్యం నాణ్యత ఏ పాటిదో తనతో పాటు, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా నివేదికలను ప్రజల ముందు ఉంచాయని గుర్తు చేశారు . అయినా అదాన్ డిస్టలరీకి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అంత పెద్ద మొత్తంలో మద్యం సరఫరాకు  ఆర్డర్ ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం ఇవాళ కాకపోతే, రేపు వెలుగులోకి వస్తుందని, ఈ కుంభకోణంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖుల మూలాలు ఉన్నాయన్నారు.
 ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏకకాలంలో 30 నుంచి 40 చోట్ల ఈ డి సోదాలను నిర్వహించగా, సిబిఐ  పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంపై అత్యద్భుతంగా పనిచేస్తున్న కేంద్రాన్ని అభినందిస్తూనే, రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాలలో అవినీతి, అక్రమాలు... కుంభకోణంపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ, కేంద్రానికి తాను ఒక లేఖ రాయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.  మద్యం అమ్మకాలలో అక్రమాలు జరుగుతున్నాయని, తమ రాష్ట్ర ప్రభుత్వంపై ఎందరికో అనేక అనుమానాలు ఉన్నాయన్న ఆయన, తమకు కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీరామచంద్రుడి మాదిరిగా సత్య వాక్కు పరిపాలకుడే అనుకుందామన్న రఘురామకృష్ణంరాజు, చెప్పింది ఒక్కటి కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి  సత్యవాక్కు పరిపాలకుడే, నిజాయితీపరుడని అనుకుందామని, కానీ ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. వారి అనుమానాలను తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అనుమానాలు తీరాలంటే,  రాష్ట్రంలో కొనసాగుతున్న మద్యం అమ్మకాలపై, నగదు లావాదేవీల వ్యవహారంపై, అదాన్ డిస్టలరీస్ కు ఏ ప్రాతిపదికన మద్యం ఆర్డర్లు ఇస్తున్నారన్నదానిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, నిజాలను నిగ్గు తేల్చాలన్నారు . త్వరలోనే తమ పార్టీ ఎన్నికలకు వెళ్ళనుందని, ఇలాంటి అనుమానాలు ప్రజల్లో ఉంటే, తమ పార్టీ పుట్టి మునుగడం ఖాయమన్నారు. అందుకే పార్టీలో సభ్యుడిగా, పార్టీని కాపాడుకునేందుకే మద్యం అమ్మకాలలో అవకతవకలు 
 జరుగుతున్నాయనీ  ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. 


లక్ష రూపాయల పెట్టుబడితో అదాన్ ప్రారంభం

2019 లో లక్ష రూపాయల పెట్టుబడితో అదాన్ డిస్టలరీస్ ను శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి లు ప్రారంభించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.  రోహిత్ రెడ్డి , ఏ 2 విజయసాయిరెడ్డి అల్లుడని ఆయన పేర్కొన్నారు. అయితే అదాన్ డిస్టలరీస్ డైరెక్టర్లుగా పేర్కొన్న శ్రీనివాస్, బొలారం శివకుమార్ ఎవరికీ తెలియదన్నారు.  మియాపూర్ లోని అరబిందో ఫార్మా కంపెనీ ప్రధాన కార్యాలయం  అడ్రస్ ను, అదాన్ డిస్టలరీస్ కంపెనీ చిరునామాగా పేర్కొనడం జరిగిందన్నారు. లక్ష  రూపాయలతో ప్రారంభించిన అదాన్ డిస్టలరీస్ కంపెనీ యజమానులు , చిన్న చిన్న డిస్టలరీ యజమా నులను బెదిరించి, వారి డిస్టలరీ లను లీజు తీసుకున్నారన్నారు.  కేంద్ర సర్వీసులలో అతి తక్కువ సర్వీసుకు చెందిన జూనియర్ అధికారైన వాసుదేవ రెడ్డికి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నిర్వహణ బాధ్యతలను అప్పగించడంతో, సింహ భాగం మద్యం ఆర్డర్లను అదాన్ డిస్టలరీ కి ఇచ్చారని తెలిపారు.  ప్రముఖ బ్రాండ్లను తయారు చేసే మద్యం డిస్ట లరీలకు,  ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ మద్యం ఆర్డర్లను
 ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రముఖ బ్రాండ్లను ఉత్పత్తి చేసే డిస్టలరీలు అయితే, మద్యం సేవించే వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద  తీసుకొని బ్రాండ్లను సిద్ధం చేస్తాయన్నారు. కానీ అదాన్ డిస్టలరీ ఉత్పత్తి చేసే మద్యం బ్రాండ్లలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. 

డిస్టలరీల లైసెన్సు రద్దు చేయవచ్చు కదా?

గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే డిస్టలరీలకు అనుమతి ఇచ్చారని పదే, పదే చెప్పే తమ ప్రభుత్వ పెద్దలు, ఆ డిస్టలరీల లైసెన్సు రద్దు చేయవచ్చు కదా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రజావేదికను కూల్చిన తమ ప్రభుత్వ పెద్దలు, పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను బద్దలు కొట్టారని, అటువంటప్పుడు డిస్టలరీల లైసెన్సు రద్దు చేయడానికి అభ్యంతరం ఏమిటి అంటూ నిలదీశారు. ఎందుకంటే డిస్టలరీల లైసెన్సు రద్దు చేస్తే, వచ్చే ఆదాయం రాదు కదా అంటూ ఎద్దేవా చేశారు. ఎస్పీవై రెడ్డికి చెందిన డిస్టలరీ నీ ప్రస్తుతం ఎవరు లీజుకు తీసుకున్నారని, దాని నిర్వాహకులు ఎవరు అంటూ ప్రశ్నించారు. ఆ డిస్టలరీ నిర్వహణ వెనుక చిత్తూరు కు చెందిన రెడ్డి నేతల, మద్రాసు కు చెందిన అదే సామాజిక వర్గ వ్యక్తుల ప్రమేయం లేదా అంటూ ప్రశ్నించారు. గతంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కేవలం గోడౌన్ల నిర్వహణ మాత్రమే చూసుకునేదని, షాపులను వేలం వేసి, వారి వద్ద నుంచి ఎక్సైజ్ డ్యూటీ రూపం లో  ఆదాయాన్ని సమకూర్చుకునేదని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నదని, దానిలో భాగంగా గతంలో 50 రూపాయలకు లభించిన ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ లిక్కర్ సీసాను, కాదని అదాన్ డిస్ట లరీ  ఉత్పత్తి చేస్తున్న ఊరు పేరు లేని బ్రాండ్ క్వార్టర్ 250 రూపాయలకు విక్రయిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం నాణ్యత పై తాను ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఈ తొక్కలో బ్రాండ్లు ఎందుకని వేరే ఊరిలో లేవు అంటూ ప్రశ్నించిన ఆయన, ఇక్కడ ఒక్క చోటనే ఎందుకు ఉన్నాయని నిలదీశారు. ఈ తొక్కలో బ్రాండ్ ను తాగితే మంచిదని వాసుదేవ రెడ్డికి చెప్పింది ఎవరు అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అలాగే మద్యం విక్రయాలను కేవలం నగదు లావాదేవీల ద్వారానే ఎందుకు విక్రయిస్తున్నారంటూ నిలదీశారు. ఇందులో మర్మం ఏమిటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

200 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఎందుకు ఇచ్చారు?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో 108 షాపులకు రోజుకు 2.75 లక్షల చొప్పున ట్రైడెంట్ కెమ్ ఫామ్, సత్యా కెమ్ ఫామ్ లు 200 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఎందుకు ఇచ్చారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈ రెండు కంపెనీలు విజయసాయి రెడ్డి అల్లుడి రోహిత్ రెడ్డికి చెందిన వని పేర్కొన్న  ఆయన, వాళ్లకు సంబంధం లేకపోతే బ్యాంకు గ్యారంటీ ఇవ్వరు కదా అంటూ ప్రశ్నించారు. మానవ సంబంధాలు మృగ్యమైన ఈ రోజుల్లో అతని వ్యాపారం కాకపోతే, అతనికి సంబంధం లేకపోతే... గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా అంటూ ప్రశ్నించారు. 
 తండ్రి సంపాదించిన ఆస్తిలోనే చెల్లెలుకు వాటా ఇచ్చేందుకు కొట్టుకుంటున్న ఈ రోజుల్లో, అన్నా చెల్లెలు, తల్లి మధ్య  ఆస్తుల పంపకాలలో విభేదాలు తలెత్తుతున్న ఈ సమాజంలో , ఎవరు కూడా 200 కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఉదార స్వభావాన్ని ప్రదర్శించరు కదా అని నిలదీశారు. ఒకవేళ లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన కంపెనీకి రెండువేల కోట్ల రూపాయలు టర్నోవర్ కు అవకాశం కల్పించిన వ్యక్తికి ప్రత్యూపకారంగా, ఈ బ్యాంకు గ్యారంటీ ఇచ్చి ఉండాలన్నారు. ఇందులో ఏది నిజం అని ప్రశ్నించిన ఆయన, ప్రస్తుతం మానవ సంబంధాలను బట్టి అర్థం చేసుకోవాలన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా చెబుతున్నా సృజన్ రెడ్డి, విజయసాయి రెడ్డికి అత్యంత ఆప్తుడని, అలాగే ప్రభుత్వాన్ని శాసించే కీలక స్థానాల్లో ఉన్న వారికి కూడా ఆప్తుడని పేర్కొన్నారు. తెలంగాణలో సృజన్ రెడ్డి ఇంటిపై ఈడి సోదాలు నిర్వహించిందని, అయితే సాక్షి దినపత్రికలో ఎక్కడ కూడా ఈ వార్త ప్రచురించలేదని అని అన్నారు. రాష్ట్రంలోని మద్యం వ్యాపారంలో లేబుళ్లను అతికించడం నుంచి మొదలుకొని, రవాణా వరకు అన్నీ కూడా ఒక ప్రభుత్వ సలహాదారుని కనుసనల్లో కొనసాగుతున్నాయన్న ఆయన, మద్యం అమ్మకాలలో నగదు లావాదేవీలు ఎందుకని అంటే... ఆ ఒక్కటి మాత్రం అడగవద్దని అంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. నగదు లావాదేవీలు కాకుండా, డిజిటల్ లావాదేవీలు జరిపితే, ఆ మొత్తం ప్రభుత్వ ఖాతాలో జమవుతుందని... అందుకే , మద్యం అమ్మ కాలన్నీ నగదు లావాదేవీల ద్వారానే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం 1500 కోట్ల  రూపాయల టర్నోవర్ కలిగిన సినిమా రంగాన్ని, డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలని ఆంక్షలు విధించిన ప్రభుత్వ పెద్దలు, ఏటా 30 వేల కోట్ల రూపాయల ... అంటే మూడేళ్లలో 90 వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన మద్యం అమ్మకాలను మాత్రం  నగదు లావాదేవీల ద్వారా నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. 

అవాకులు చెవాకులు మాట్లాడిస్తారా?

పార్టీకి చెందిన నలుగురు ఆడవాళ్లను పోగేసి, బయట పార్టీకి చెందిన వాళ్లపై లేనిపోని అవాకులు, చెవాకులు పేలితే మాటలు రావని... చేతకాక, చేవలేక ఊరుకుంటారని అనుకుంటున్నారా? అని రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. తప్పు చేశారు... మూసుకొని కూర్చోండి, సంబంధం లేని వారిపై అవాకులు చెవాకులు పేలితే అసహ్యంగా  ఉంటుందన్నారు. దానికి ఆడవాళ్లను ప్రయోగిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. 

న్యూడ్ వీడియో ముందు విచారణ చేయండి

32 రోజుల తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్ తనకు అవమానం జరిగినట్టు, తనది కానిది... తనదిగా వీడియో  చూపిస్తూ ప్రచారం చేశారని సిబి సిఐడి కి ఫిర్యాదు చేశారని, ఆ వెనువెంటనే సిఐడి చీఫ్ సునీల్ కుమార్ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రాథమిక విచారణ నిర్వహించకుండానే ఎఫ్ ఐ ఆర్ ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిందని చెబుతున్న మాధవ్, న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరువు నష్టం దావా వేయవచ్చునని సూచించారు. కానీ మాధవ్ మాత్రం క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరడం, దానికి పీవీ సునీల్ కుమార్... 153 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కులాలు, జాతుల మధ్య విద్వేషాలను రెచ్చగొడితే ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారని చెప్పారు. గోరంట్ల మాధవ్ విప్పి చూపింది లేదు, ఒకవేళ విప్పాడనుకున్నా... దానికి కులాలు, జాతుల మధ్య విద్వేషానికి సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. సిఐడి పోలీసులు కళ్ళు మూసుకొని తమకు గిట్టని వారిపై 153 ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐ టీడీపీ ద్వారా ఈ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యిందని, దానికిగాను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ పై కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను ఒక కేంద్రమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య చేస్తే, తమ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పై, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పై కేసులు నమోదు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పై తొలుత రాష్ట్ర పోలీసులకు సంబంధం లేని ఫోరెన్సిక్ ల్యాబ్ లో పరీక్ష నిర్వహించాలని, అది మార్ఫింగ్ చేశారా? లేదా అన్నదానిపై ముందు నిర్ధారణకు రావాలన్నారు. ఆ తరువాత థర్డ్ పార్టీ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడే నోటీసులు ఇవ్వాలని, లేకపోతే ఇప్పటికే అప్రతిష్ట పాలైన ఏపీ పోలీసులు, మరింత అప్రతిష్టను మూట కట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 32 రోజుల తర్వాత  న్యూడ్ వీడియో గురించి గోరంట్ల మాధవ్ సిఐడి కి ఫిర్యాదు చేయడం... ప్రజలు మర్చిపోయిన అంశంపై మళ్లీ తెరపైకి తీసుకురావడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉన్నదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తనపై ఒక దిక్కుమాలిన ఎఫ్ఐఆర్ నమోదు చేసి కస్టడీకి తీసుకొని చిత్రహింసలకు గురి చేసి, ఒక దుష్టుడు తన మృగ తృష్ట ను తీర్చుకున్నాడ ని, అలాగే మళ్లీ ఎవరినైనా హింసిస్తే చూడాలని అనుకుంటున్నాడా?  అని ఆయన  ఆందోళన వ్యక్తం చేశారు.