home page

వందేళ్ళ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఆరుట్ల గ్రంధాలయం

ఎందరికో జ్ఞానం ప్రసాదించిన గ్రంధాలయం ఇది

 | 
Library

సందర్శకుల పుస్తకంలో సంతకం చేసి లైబ్రరీలో కాలుమోపిన ప్రతి చదువరీ, చదివిన పుస్తకాన్ని అరలో జాగ్రత్తగా సర్ది వెనక్కి వస్తున్న సమయానికి.. కనీసం 

పిడికెడు జ్ఞానాన్ని తన వెంట తీసుకెళ్తాడు. రోజుకు సగటున వందమంది సందర్శించినా.. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని ఆ వందేండ్ల లైబ్రరీ ఎన్ని టన్నుల జ్ఞానాన్నీ, చైతన్యాన్నీ, విలువలనూ, ప్రజాస్వామ్య భావాలనూ పంచిపెట్టి ఉండాలి?వందేండ్ల గ్రంథాలయమా నీకు వందనాలు!

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల గ్రంథాలయం కీలక పాత్ర పోషించింది. ప్రతి ఒక్కరికీ విద్యను అందించాలని, విద్యతోనే చైతన్యం సాధ్యమనీ బలంగా విశ్వసించేవారు ఉన్నవ వెంకటరామయ్య అనే విద్యాధికుడు. ఆ దార్శనికుడు స్నేహితులు, భావసారూప్యం ఉన్న వ్యక్తులతో కలిసి 1920లో ఆరుట్లలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. వెంకటరామయ్య మిత్రబృందం రోజూ ఆరుట్లతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు చదువు నేర్పించేవారు. నిజాం సర్కారు నిరంకుశ నిర్బంధాలు కొనసాగుతున్నా లెక్కచేయకుండా ముందుకు సాగారు. అంతేకాదు, నిజాం అరాచకాలపై పుస్తకాలు ముద్రించారు. వివిధ గ్రంథాలయాల్లో వాటిని అందుబాటులో ఉంచారు. మహాత్ముని నేతృత్వంలో జరిగిన స్వాతంత్య్రోద్యమంలోనూ ఆరుట్ల గ్రంథాలయం ప్రధాన పాత్ర పోషించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటి గ్రంథాలయం ఆరుట్లలోనే ఏర్పాటైంది.

దాతృత్వమే ఊపిరిగా

హైదరాబాద్‌కు 30 మైళ్ల దూరంలో ఉంటుంది ఆరుట్ల. ఈ ప్రాంతం జాగీర్దార్‌ శృంగి శేషగిరిరావు పెత్తనం కింద ఉండేది. ఇబ్రహీంపట్నం కంటే పెద్దదిగానే ఉండేది ఆరుట్ల. జాగీర్దార్లు పన్నుల కోసం ప్రజలను పీడించేవారు. ఇబ్రహీంపట్నం, ఆరుట్ల, మంచాల ప్రాంతాల నుంచి భారీ ఆదాయం వచ్చినా.. ప్రజలకు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించేవారు కాదు. కనీసం ఒక పాఠశాల నడపలేని పరిస్థితి. విద్య లేకపోతే చైతన్యమూ లేదు. దీంతో మూఢనమ్మకాలు రాజ్యమేలేవి. ఆ పరిస్థితుల్లో విద్యాభివృద్ధికి ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు వెంకటరామయ్య. ప్రపంచ వార్తలు, జాతీయ వార్తలు, సంస్థాన వార్తలను ప్రజలకు చదివి వినిపించేవారు. నిజానికి ఉన్నవ వెంకటరామయ్యది ఆంధ్ర ప్రాంతం. స్థానిక భూస్వామి వింజమూరి గోవిందరావు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఆరుట్లకు వచ్చారు. సాహిత్యాభిమాని, చైతన్యశీలి కావడంతో ఆరుట్ల పరిసర ప్రాంతాల పరిస్థితులు ఆయనను కదిలించాయి. ఏ సమస్యకైనా అక్షరాన్ని మించిన పరిష్కారం లేదని భావించేవారు వెంకటరామయ్య. కాబట్టే, హనుమదాంధ్ర భాషా నిలయానికి శ్రీకారం చుట్టారు. సొంత భవనాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు ముందుకు వచ్చినా, కంసాలి రంగయ్య తన పెంకుటింట్లో గ్రంథాలయ ఏర్పాటుకు సహకరించారు.

వేల పుస్తకాలు

హనుమదాంధ్ర గ్రంథాలయం కేవలం 20 పుస్తకాలతో ప్రారంభమైంది. తదనంతరం రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. ప్రస్తుతం 18 వేల పుస్తకాలు ఉన్నాయి. అందులో పదిహేనువేల తెలుగు పుస్తకాలు, రెండువేల ఇంగ్లిష్‌ పుస్తకాలు, ఆరువేల హిందీ పుస్తకాలు, నాలుగువందల ఉర్దూ పుస్తకాలు ఉన్నాయి. అలనాటి పత్రికల పాత ప్రతులను కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడే పుస్తకాలు చదువుకుని, ఆ పరిజ్ఞానంతో ఇక్కడే లైబ్రేరియన్‌ కొలువు సంపాదించుకున్నారు మాజీ గ్రంథపాలకుడు యాదయ్య. 'ఆరుట్ల గ్రంథాలయం శతాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో అన్ని వసతులూ సమకూర్చాం' అని వివరిస్తారు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డి. గ్రామ సర్పంచ్‌ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నారు. గ్రంథాలయ ఉత్సవం అంటేనే ఊరుమ్మడి పండుగ!

ఏటా మహాసభలు

ఆరుట్ల గ్రంథాలయంలో ఏటా మహాసభలను నిర్వహించేవారు. అందులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి పెద్దపెద్ద జాతీయోద్యమ నాయకులు వెళ్లేవారు. బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి, ఉమ్మెత్తల కేశవరావు, నరసింహారావు, రామచంద్రారావు, మర్రి చెన్నారెడ్డి, వి.బి.రాజు తదితరుల ప్రసంగాలు ప్రజల్లో చైతన్యం నింపేవి. ఇబ్రహీంపట్నం వరకు బస్సు లేదా కారులో వచ్చి, అక్కడినుంచి సైకిళ్ల మీద, ఎడ్లబండ్ల మీద ఆరుట్లకు చేరుకునేవారు.

… రాఘవేందర్‌

(నమస్తే తెలంగాణా పత్రిక నుంచి)